గూగుల్‌లో ‘చర్చిల్’ ఫోటోలు మాయం

by Harish |
గూగుల్‌లో ‘చర్చిల్’ ఫోటోలు మాయం
X

దిశ, వెబ్‌డెస్క్ :
బ్రిటన్ మాజీ ప్రధాని ‘విన్‌స్టన్ చర్చిల్’ తెలుసు కదా. ప్రస్తుతం ఆయన గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే, పేరు మాత్రమే కనిపిస్తూ.. ఫొటో కనిపించడం లేదు. తాజాగా ఈ విషయంపై నెటిజన్లు ట్వీట్ వార్ మొదలెట్టారు. చర్చిల్ ఫొటోలు ఎందుకు తీసేశారు? కారణాలేంటి? అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా గూగుల్‌ను ప్రశ్నించారు. దాంతో ఆదివారం ఈ ఇష్యూ‌పై రియాక్ట్ అయిన గూగుల్.. ట్విట్టర్ వేదికగా బదులిచ్చింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేశామని నెటిజన్లకు తెలిపింది. ఇంతకీ అసలేం జరిగింది?

అమెరికాలో నల్లజాతీయుడు ‘జార్జి ఫ్లాయిడ్’ పోలీసుల చేతిలో మృతి చెందడంతో తీవ్రస్థాయిలో నిరసనలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు పలు దేశాల్లో ‘జాతి వివక్ష’ పోరాటాలు జరుగుతున్నాయి. ఈ నిరసన జ్వాలలు క్రమంగా బ్రిటన్‌కు కూడా వ్యాపించాయి. ఇదే క్రమంలో నిరసనకారులు.. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద గల బ్రిటన్ మాజీ ప్రధాని ‘విన్‌స్టన్ చర్చిల్’ విగ్రహంపై రేసిస్టు అని రాశారు. మన జాతిపిత ‘మహాత్మా గాంధీ’ విగ్రహం కింద కూడా అదే విధంగా రాయడం గమనార్హం. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో.. చర్చిల్ మనవరాలు ‘ఎమ్మా సోమెస్’ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. ‘అతనో హీరో, వెరీ పవర్‌ఫుల్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి. మా తాత విగ్రహానికి ఇక్కడ రక్షణ లేకపోతే.. మ్యూజియంలో పెడతాను. ఆయన లేని పార్లమెంట్ స్క్వేర్ పూరర్ ప్లేస్’ అని పేర్కొన్నారు.

ఈ విషయాల్ని పక్కన పెడితే.. గూగుల్‌లో ‘చర్చిల్’ గురించి సెర్చ్ చేసినా.. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అని సెర్చ్ చేసినా ఆయన ఫోటో కనిపించడం లేదని నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెట్టారు. అడాల్ఫ్ హిట్లర్, స్టాలిన్ వంటి గ్రేటెస్ట్ మాస్ మర్డరర్స్ ఫోటోలు కనిపిస్తున్నాయి కానీ చర్చిల్ వంటి నేత ఫోటో కనిపించకపోవడం ఏంటి? అంటో మరో నెటిజన్ ప్రశ్నించారు. 52 మంది బ్రిటన్ ప్రధానుల ఫొటోలు కనిపిస్తున్నాయి కానీ.. చర్చిల్ ఫొటో మాత్రం ఎందుకు మిస్ అయ్యిందని ఇంకో నెటిజన్ ప్రశ్నించారు. ఇలా ట్విట్టర్‌లో చిన్నపాటి వార్ నడిచింది. దీంతో స్పందించిన గూగుల్‌.. అప్‌డేట్ అయ్యే క్రమంలో ఫొటో మిస్ అయుండొచ్చని, అదంతా ఆటోమేటికల్‌గా జరుగుతుందే తప్ప కావాలని చేసింది కాదని, దీనికి మేము సారీ చెబుతున్నామని గూగుల్ వివరణ ఇచ్చింది. కాగా గూగుల్ ఇచ్చిన వివరణపై నెటిజన్లు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story