కన్నీరు పెట్టిస్తున్న శునకాలు..

by Shamantha N |   ( Updated:2020-08-10 08:02:44.0  )
కన్నీరు పెట్టిస్తున్న శునకాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వాసానికి ప్రతిరూపం శునకం అంటారు. మనిషికి లేని విశ్వాసం కుక్కకు ఉంటదని ఇప్పటికే చాలామార్లు నిరూపితమైంది. అవి తమ యజమానుల కోసం ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధపడుతాయి. ఇటీవల వచ్చిన టామీ సినిమాలో ఒక కుక్క తన యజమాని కోసం ఎంత తాపత్రాయ పడుతుందో కళ్లకు కట్టారు. డ్యూటీకి వెళ్లిన తన యజమాని అక్కడే చనిపోతే.. ఆయన తిరిగి వస్తాడేమోనని ఏళ్ల తరబడి రైల్వే స్టేషన్‌లోనే ఎదురు చూస్తుంది. ఈ చిత్రం అందరి మనసులను కదిలించింది. సరిగ్గా అలాంటి ఘటనే కేరళలోని తిరువనంతపురంలో పునరావృత్తం అవుతోంది. అందరినీ కన్నీరు పెట్టిస్తున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రంలోని ఇడిక్కి జిల్లా రాజయలైలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 47 మంది వరకు చనిపోయారు. మరో 24 మంది కోసం గాలిస్తున్నారు. అయితే కొండ చరియలు విరిగిపడిన నాటి నుంచి రెండు శునకాలు ఆ ప్రాంతంలోనే తమ యజమానుల కోసం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నాయి. వెలికి తీసిన ప్రతి మృతదేహం దగ్గరకు వెళ్లి వాసన చూసి తన యజమాని కాదని తిరిగి వస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కొండచరియలు విరిగిపడిన చోటే తిరుగుతూ రోదిస్తున్నాయి.

వాటి బాధను అర్థం చేసుకున్న అధికారులు వాటికి ఆహారం పెట్టినా అవ్వి ముట్టుకోవడం లేదు. స్థానికులు సైతం వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన అవ్వి అక్కడి నుంచి కదలడం లేదు. తనని పెంచి పోషించిన యజమానులు ఎప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకంతో అలాగే శిలా విగ్రహాల్లా నిలబడి ఎదరు చూస్తున్నాయి. వాటి విశ్వాసం, నమ్మకాన్ని చూసిన అధికారులు, స్థానికులు చలించిపోతున్నారు. వాటి యజమానులు క్షేమంగా తిరిగి రావాలని మనమూ కోరుకుందాం.

Advertisement

Next Story