కరోనా కలకలం

by sudharani |
కరోనా కలకలం
X

దిశ, వరంగల్:
కరీంనగర్ జిల్లాలో ఒక్కరోజే ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్లు వెలువడ్డ వార్తలు.. పక్క జిల్లా ఓరుగల్లులోనూ కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల కిందట వరంగల్‌ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన వారికి వ్యాధి లేదని నిర్ధారణ అయినప్పటికీ ప్రజలు మాత్రం ఆందోళన నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడ నలుగురు కలిసినా కరోనా గురించే చర్చించుకుంటున్నారు. ఈ మహమ్మారి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే జనాలు గుమిగూడే ప్రాంతాలపై నిషేధం విధించింది. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్క్‌లు, బార్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక కేంద్రాలను మూసివేశారు. 200 మందికిపైగా పాల్గొనే వేడుకలకు సైతం ప్రజలు దూరంగా ఉండాలని పదేపదే సూచిస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినందున పిల్లలను బయటకు వెళ్లనీయవద్దని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.

కర్ఫ్యూ వాతావరణం ?

కరోనా వైరస్ దెబ్బకు ప్రధాన నగరాల్లోని వాతావరణం కర్ఫ్యూను తలపిస్తోంది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు జనం ఇంటికే పరిమితమవుతున్నారు. టీవీలకు అతుక్కుపోయి దేశంలో ఏం జరుగుతుందో అనే సమాచారాన్ని నిశితంగా గమనిస్తున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. వైరస్ ప్రభావంతో పలు వ్యాపారాలు కొనసాగడం లేదు. చికెన్, మటన్ వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ధరలు ఒక్కసారిగా నేలను తాకాయి. కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాణా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉచితంగా కోళ్లు పంపిణీ చేస్తున్నారు. బార్లు సైతం మూసి ఉండటంతో మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేడుకలకు దూరంగా జనం..

కరోనా వైరస్ ప్రభావంతో పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో పాల్గొనేందుకు బంధువులు, స్నేహితులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర వేడుకలను గమనిస్తే ఆయా కుటుంబీకులు, దగ్గరి బంధువులు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఈ నెల 31 తర్వాత ఫంక్షన్ హాళ్లు సైతం బుకింగ్ చేసుకోవద్దని ఆదేశాలున్న నేపథ్యంలో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అద్దె వాహనాలు, ప్రైవేటు వాహనాల గిరాకీలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జనసమ్మర్థం గల ప్రదేశాల్లో నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు తగు సూచనలు చేస్తున్నారు. పరీక్షలు రాసే వారు ఖచ్చితంగా మాస్క్‌లు, శానిటైజర్లు కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలని, జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు వుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

Tags : Corona, Warangal, Marriage, Function, People Panic

Advertisement

Next Story