కందుల పైసలు జమగాట్లే !

by Shyam |
కందుల పైసలు జమగాట్లే !
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో కంది పంటను అమ్ముకున్న రైతులు కన్నీరు పెడుతున్నారు. కష్టపడి పండించిన పంటకు ఇంతవరకు ఖాతాల్లో పైసలు జమ కాకపోవడంతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంట అమ్మి నెలన్నర గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో సతమతమవుతున్నారు. కనీసం నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు కూడా రైతుల చేతిలో చిల్లి గవ్వ లేక .. కాలాన్నీ కష్టంగా నెట్టుకొస్తున్నారు. ప్రతిరోజు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసి, ఎంత మొరపెట్టుకున్నా చెప్పాల్సిన ముచ్చట చెప్పి వెనక్కే పంపిస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో దాదాపు నెలన్నర క్రితం రైతుల వద్ద అధికారులు కంది పంటను కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్ సహకారంతో సింగిల్ విండో ఆధ్వర్యంలో గతనెల 2వ తేదీన జిల్లాలోని 4 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి 1003 మంది రైతుల వద్ద పంటను కొన్నారు. క్వింటాల్‌కు రూ.5,800 చొప్పున 8వేల క్వింటాళ్లను తీసుకున్నారు. ఈ పంటకు రూ.4.64 కోట్లు రైతులకు చెల్లించాలి. అయితే పంటను కొనుగోలు చేసే సమయంలో పదిరోజుల్లోనే చెల్లిస్తామని చెప్పిన అధికారులు… ఇప్పటికీ నగదు చెల్లించలేదు.

లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ఎలాంటి పనుల్లేక పోవడమే గాక చేతిలో పైసలు సైతం అయిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటను అమ్ముకొని పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి తమ బ్యాంక్ ఖాతాల్లో కందులు పైసలు జమ అయ్యేలా చూడాలని కన్నీరు పెట్టుకుంటున్నారు.

Tags: RR district, kandi farmers, banks, markfed, single window, agriculture officials

Advertisement

Next Story