కరోనాకు ‘పతంజలి’ మందు..7రోజుల్లోనే నయం

by Shamantha N |   ( Updated:2020-06-23 09:32:55.0  )
కరోనాకు ‘పతంజలి’ మందు..7రోజుల్లోనే నయం
X

డెహ్రాడూన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ‘పతంజలి’ ఆయుర్వేద సంస్థ మందును కనిపెట్టినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకులు, యోగాగురు రాందేవ్ బాబా వెల్లడించారు. ‘కరోనిల్’ పేరుతో తయారు చేసిన ఈ ఔషధం కిట్‌‌ను ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పతంజలి హెడ్‌క్వార్టర్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ.. ఈ ఔషధం ప్రయోగదశలో వందశాతం అనుకూల ఫలితాలనిచ్చిందని తెలిపారు. కరోనిల్‌ను అశ్వగంధ, గిలోయ్, తులసితో కలిపి రోగులకు ఇచ్చినప్పుడు 100 శాతంమంది కోలుకున్నారని వెల్లడించారు. పతంజలి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కలిసి సంయుక్తంగా రూపొందించినట్టు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్‌లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును తీసుకొచ్చామని వివరించారు. ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. 100కు పైగా మూలికలతో తయారు చేసిన కరోనిల్‌ మాత్రలతో 7 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చునని రాందేవ్ వెల్లడించారు. కరోనాకు ఇతర సంస్థల కంటే ముందుగానే ఆయుర్వేద ఔషధాన్ని తీసుకురావడం గర్వంగా ఉన్నట్టు పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు.

ధర ఎంతంటే..

ఈ ఔషధాన్ని కిట్ రూపంలో మార్కెట్లోకి తీసుకురానున్నట్టు పతంజలి వెల్లడించింది. దివ్య కరోనా కిట్‌గా పిలిచే ఇందులో కరోనిల్‌ మాత్రలతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే శ్వాసరీ అనే మాత్రలు, అను ఆయిల్ అనే నూనే ఉంటాయి. ఈ కిట్ ధర రూ.545గా నిర్ణయించినట్టు ఆచార్య బాలక్రిష్ణ తెలిపారు. ఇందులో 30రోజులకు సరిపడా ఔషధాలు ఉంటాయని వెల్లడించారు.

ఎక్కడ దొరుకుతుంది

వారం రోజుల్లో దేశంలోని అన్ని పతంజలి స్టోర్లలోనూ ఈ దివ్య కరోనా కిట్ అందుబాటులో ఉంటుందని రాందేవ్ బాబా వెల్లడించారు. అంతేకాకుండా ఈ కిట్‌ను హోం డెలివరీ చేసేందుకు ఓ యాప్‌ను కూడా ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.

ఎలా వాడాలి

కిట్‌పై రాసిన సూచనల ప్రకారం.. భోజనం చేసిన అరగంట తర్వాత వేడి నీటితో రెండు కరోనిల్ టాబ్లెట్లను రెండు పూటలా తీసుకోవాలి. 6-14 ఏండ్లలోపు చిన్నారులు మాత్రం పైన చెప్పినదాంట్లో సగం పరిమాణంలోనే టాబ్లెట్‌లను తీసుకోవాలి. కరోనిల్‌తోపాటే శ్వాసరీ, అను నూనెనూ తీసుకోవాలి. కరోనా సోకిన తర్వాతనే కాకుండా కరోనా నివారణకూ ఈ ఔషధాన్ని తీసుకోవచ్చు.

దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంది: ఆయుష్

అయితే, కరోనిల్ ఔషధాన్ని ఆవిష్కరించిన కొద్దిగంటల్లోనే ఆయుష్ మంత్రిత్వశాఖ పతంజలికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఔషధంపై అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదనీ, అప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని ఆదేశించింది. ఈ మందుకు సంబంధించిన ప్రకటనలు 1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని వెల్లడించింది. ఈ మందుకోసం పరిశోధనాత్మక అధ్యయనం ఎక్కడ చేశారో, ఈ మందును దేనితో తయారు చేశారో వంటి వివరాలను సమర్పించాలని పతంజలికి ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story