రూ.100 కోట్లు స్వాహా.. పాలేరు పాత కాలువకు మళ్లీ గండి

by Sridhar Babu |   ( Updated:2021-10-10 08:45:17.0  )
రూ.100 కోట్లు స్వాహా.. పాలేరు పాత కాలువకు మళ్లీ గండి
X

దిశ, పాలేరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు పాత కాలువకు మల్లాయిగూడెం గ్రామ సమీపంలో నాలుగో వద్ద ఆదివారం మళ్లీ గండి పడింది. దీంతో కాలువలోని నీరు ఉప్పొంగి పక్కనే ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్లడంతో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఇబ్బందులు తీవ్ర పడుతున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలోనే గండి పడటంతో నీటిపారుదల శాఖ అధికారులు తూతూ మంత్రంగా గండిని పూడ్చేందుకు ఇసుక బస్తాలను అడ్డుగా పెట్టి చేతులు దులుపుకున్నారు.

తిరిగి అదే ప్రాంతంలో మళ్ళీ గండి పడటంతో చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్నిసార్లు నీటిపారుదల శాఖ అధికారులరకు తమ గోడు వెళ్లబుచ్చినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పిశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రామారావు, అనే రైతుల పొలాలు నీట మునగడంతో సుమారు 2.50 ఎకరాల వరి పంట నీటి పాలైంది.

కాలువలో నాచు గుర్రపుడెక్క తొలగించక పోవడమే గండికి కారణమని స్థానికులు చెబుతున్నారు. 2018లో పాత కాలువకు మరమ్మత్తుల కోసం రూ.100 కోట్లతో పనులు చేపట్టినా కాలువ అడుగు భాగంలో నాచు గుర్రపుడెక్క అధిక స్థాయిలో పెరిగి నీటి ప్రవాహానికి అడ్డు పడుతోంది. దీంతో 250 క్యూసెక్కుల నీరు వదిలినా అక్కడక్కడ కాలువకు గండి పడుతోంది. దీనికి తోడు క్యాచ్ పాయింట్ మరో 20 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది. ఈ నాచు, గుర్రపుడెక్కను నీటిపారుదల శాఖ అధికారులు తొలగిస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కాలువ నీటి ప్రవాహాన్ని ఆపి సత్వరమే పాలేరు పాత కాలువలో నాచు, గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed