కరోనాపై ఫైట్.. కేరళలో టైట్!

by Shyam |
కరోనాపై ఫైట్.. కేరళలో టైట్!
X

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కేరళలో ప్రవేశించి, ఇప్పటికే ముగ్గురికి సోకిన విషయం తెలిసిందే. అయితే, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాధ్యాతయుతంగా ఉన్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి కేరళ పాటిస్తున్న ప్రోటోకాల్ ను తమతో పంచుకోవాలని ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి. అయితే, ఈ ప్రోటోకాల్ ను కేరళ కొత్తగా తీసుకొచ్చిందేం కాదు. గతంలో ఇదే రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ సమయంలోనే నిఫాను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం బహుళ అంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అదే విధానాన్ని ‘కరోనా’ విషయంలోనూ అమలు చేస్తోంది. అదేంటో ఓ సారి పరిశీలిద్దాం.
రాష్ట్రంలోకి ఈ వైరస్ ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసేందుకు తొలి వలయంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉంటారు. వీరు ప్రమాదకర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో వైరస్ లక్షణాలున్నట్టైతే, అనుమానితులనే కాకుండా, వారితోపాటు సన్నిహితంగా ఉన్నవారినీ ట్రాకింగ్ సిస్టం పర్యవేక్షణలో ఉంచుతారు. తర్వాతి స్థాయిల్లో పోలీసులు, పంచాయతీలు, స్థానిక వాలంటీర్లు, వైద్యాధికారులు ఉంటారు. వీరంతా వ్యాధి గురించి భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు కలిగిన అనుమానితులు 2,239 మంది వీరి పర్యవేక్షణలో ఉన్నారు. మరో 84 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు.
అలాగే, కరోనాను ఎదుర్కొనేందుకు కేరళ ఆరోగ్య శాఖ ఐదు విమానాశ్రయాల్లో అంబులెన్స్ లను అందుబాటులో ఉంచింది. ప్రతి జిల్లాలోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వార్డులను ఏర్పాటు చేసింది. వ్యాధి లక్షణాలతో ఎవరైనా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే, వెంటనే వారిని సంబంధిత ఆస్పత్రికి తరలించి, వైద్యపర్యవేక్షణలో ఉంచుతారు. అత్యంత వేగంగా ప్రబలుతున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇదొక్కటే మార్గం. ఈ విధానం ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టం నిరంతరం అప్ గ్రేడ్ అవ్వడానికి దోహదపడుతుంది. ఇప్పటికే నిఫా వైరస్ పై కేరళ చేసిన పోరాటం దేశానికి ఉదాహరణగా నిలువగా, ప్రస్తుతం కరోనా వైరస్ ను నిలువరించడానికి తీసుకుంటున్న చర్యలను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి.

Advertisement

Next Story