శ్రీ శైలంలో అన్యమత పార్సిల్ కలకలం..

by Anukaran |   ( Updated:2020-09-24 05:28:02.0  )
శ్రీ శైలంలో అన్యమత పార్సిల్ కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

శ్రీశైలం ఆలయ పరిసరాల్లో గురువారం అన్యమత పార్సిల్‌ కలకలం సృష్టించింది. ఆలయానికి దగ్గరగా ఉండే దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్సిల్ డెలీవర్ అయ్యింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్సిల్ రావడాన్ని స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారమిచ్చారు. దేవస్థానం ఇన్‌చార్జి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో సదరు పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయంలోని పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి అది వచ్చినట్లు చిరునామా ద్వారా గుర్తించారు. సదరు వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు.పార్సిల్‌ను తెరిచి చూడగా అందులో నిత్యావసర వస్తువులను సదరు క్రిస్టియన్ సంస్థ పంపినట్లు వెల్లడైంది. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో అన్యమత ప్రచార కార్యకలాపాలు నిషిద్ధం. ఈ క్రమంలోనే అన్యమత పార్సిల్‌ కర్నూలు నుంచి శ్రీశైలానికి రావడంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed