గాలి తగిలే స్కూల్

by Shyam |
గాలి తగిలే స్కూల్
X

కరోనా కారణంగా విద్యారంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్కూల్స్ మూతపడటంతో ఆన్‌లైన్ బాట పట్టినప్పటికీ ప్రభావవంతంగా పనిజరగడం లేదు. కానీ స్కూళ్లు తెరుద్దామంటే పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేరు. పైగా అరకొరగా జరిగే ఆన్‌లైన్ క్లాసులకు మొత్తం ఫీజు కట్టడానికి వారికి మనసు రాట్లేదు. ఈ నేపథ్యంలో జీతాలు ఇవ్వకుండా ఆన్‌లైన్ పాఠాలు చెప్పమంటూ టీచర్లను ఇబ్బందిపెట్టలేక పాఠశాల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. జీతాలు రాకున్నా ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పలేక టీచర్లు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికి కారణం స్కూళ్లు తెరవకపోవడం. ఈ సమస్యలకు పరిష్కారం గాలి తగిలే స్కూల్.. అంటే ఓపెన్ ఎయిర్ స్కూల్.

పాఠశాలలు తెరిస్తే పిల్లల మధ్య సామాజిక దూరం ఉండదు. అందులోనూ పాఠశాలలు నాలుగు నుంచి ఐదు అంతస్థుల్లో నిర్మించి ఉంటాయి. మెట్లు దిగేటపుడు, ఎక్కేటపుడు, క్లాసు రూమ్‌లో పిల్లల మధ్య సామాజిక దూరం ఉండదు. దీన్ని పరిష్కరించడానికి పాఠశాలకు తగినంత అవస్థాపనా సౌకర్యం ఉండదు. ముఖ్యంగా నగరాల్లో ఉండే స్కూళ్లలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు కాశ్మీర్‌లో ఒక పరిష్కారం దొరికింది. అక్కడి బుద్గాం జిల్లాలోని దూడ్‌పత్రి గ్రామంలో ఓపెన్ ఎయిర్ స్కూల్స్ పెట్టారు. అంటే తరగతులను ఇరుకు గదుల్లో కాకుండా బయట గాలికి కూర్చోబెట్టి నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద దేవదారు చెట్ల మధ్యన, నదీ సెలయేర్ల పక్కన ఉన్న విశాలమైన స్థలాల్లో పిల్లలను దూరం దూరంగా కూర్చోబెట్టి ఈ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం వల్ల స్వచ్ఛమైన ప్రాణవాయువు అందడంతో పాటు పిల్లలకు చదువు కూడా బాగా వంటపడుతుందని, అంతేకాకుండా కరోనా భయం కూడా ఉండదని జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహ్మద్ రంజాన్ వానీ అంటున్నారు. ఒకవేళ వర్షం వస్తే టెంట్ కింద పాఠాలు చెబుతున్నారు. అలాగే ఒక టెంట్‌లో కరోనా టెస్టింగ్ కిట్ పెట్టి, పిల్లలందరికీ తరుచుగా టెస్ట్‌లు కూడా చేస్తున్నట్లు రంజాన్ వానీ వెల్లడించారు.

మన దగ్గర సాధ్యమేనా?

లాక్‌డౌన్ ఆన్‌లైన్ పాఠాల సమస్యను తీర్చడానికి ఈ ఓపెన్ స్కూల్ ఐడియా బాగానే ఉన్నప్పటికీ మన దగ్గర వర్కవుట్ అవుతుందా? లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలి. కాశ్మీర్ అంటే లోయప్రాంతం, పెద్ద పెద్ద విశాల భూభాగాలు ఉంటాయి కాబట్టి ఓపెన్ ఎయిర్ స్కూల్ కోసం స్థలం ఉంటుంది. కానీ మహానగరం హైదరాబాద్‌లో ఇప్పటికప్పుడు ఓపెన్ స్కూల్ అంటే కష్టమే. కానీ గ్రామాల్లో ఇది సాధ్యమవుతుంది. ఎలాగూ ఎక్కువ మంది పిల్లలు గ్రామాల్లోనే ఉన్నారు కాబట్టి, అక్కడ ఇలాంటి ఓపెన్ ఎయిర్ స్కూల్ సాధ్యమవుతుంది. ఇప్పటికే నాలుగు నెలలుగా హాలీడేస్‌తో పిల్లలకు చిరాకు వచ్చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు సెప్టెంబర్‌లో స్కూల్‌లు తెరుస్తామని ప్రకటించడంతో కొంత ఊరట కలిగింది. కానీ అది అమలయ్యే వరకు సందిగ్ధత అలాగే ఉంది. ఈలోగా ఇలాంటి ఓపెన్ ఎయిర్ స్కూల్ ద్వారా పిల్లలకు మళ్లీ పాఠశాల వాతావరణాన్ని పరిచయం చేయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed