హైదరాబాద్‌లో నర్సుల కొరత.. జీతం రూ. 45 వేలు ఇస్తామని ప్రకటనలు

by Shyam |
హైదరాబాద్‌లో నర్సుల కొరత.. జీతం రూ. 45 వేలు ఇస్తామని ప్రకటనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ బారిన పడే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో నర్సులు, ఫార్మసిస్టులు, లాబ్ టెక్నీషియన్లకు కొరత ఏర్పడింది. తక్షణం రిక్రూట్ చేసుకునేలా ఎక్కువ జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారిని నియమించుకునేలా ఆ రాష్ట్రాల్లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. ఇంతకాలం నర్సులకు నెలకు గరిష్ఠంగా రూ. 15 వేలు కూడా జీతం ఇవ్వలేని ఆస్పత్రులు ఇప్పుడు ఏకంగా రూ. 45 వేలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాయి. కొవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించి ప్రత్యేకంగా వార్డులు, బెడ్‌‌లను కేటాయించిన తర్వాత కొద్దిమంది నర్సులు కరోనా బారిన పడి క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. మరోవైపు పేషెంట్లకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నందున లాబ్ టెక్నీషియన్ల కొరత కూడా ఏర్పడింది.

గతేడాది జూలై-సెప్టెంబరు మాసాల్లో సైతం ఇదే తరహా కొరత ఏర్పడింది. కేరళ నర్సులే ఆ సమయంలో కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాణం పోశారు. కానీ ఈసారి మాత్రం నగరంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకకపోవడంతో ఏకంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని నర్సులకు తెలిసేలా అక్కడే ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒకవేళ నర్సులు ఇక్కడకు వచ్చి చేరడానికి సిద్ధమైతే రానుపోను విమాన ఛార్జీలతో సహా ఇక్కడ వసతి సౌకర్యాలను స్వంత ఖర్చుతో అదనంగా కల్పించడానికి కూడా ఆస్పత్రుల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా ఇలాంటి ప్రకటనలు చేసినా అవసరానికి తగినంత సంఖ్యలో మాత్రం నర్సులు దొరకడంలేదు.

బోనస్‌గా కొవిడ్ ఇన్సూరెన్స్..

గతేడాది కరోనా సమయంలో ‘కొవిడ్ ఇన్సూరెన్స్’ పథకం అమలు గురించి పెద్దగా పట్టించుకోని ఆస్పత్రుల యాజమాన్యం ఈసారి మాత్రం ముందుగానే వారికి ఆ సౌకర్యాన్ని కల్పిస్తామంటూ హామీ ఇస్తున్నాయి. గతేడాది కరోనా బారిన పడిన తర్వాత విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న నర్సులకు జీతాన్ని కట్ చేయడంతో నర్సుల నుంచి పెద్దయెత్తున నిరసనలు వచ్చాయి. నర్సింగ్ సంఘాలు కూడా జోక్యం చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కరోనా పేషెంట్లకు రోజుకు పన్నెండు గంటలు సేవ చేసినా చివరకు ఇన్‌ఫెక్షన్‌కు గురైతే యాజమాన్యం పట్టించుకోదన్న స్వీయానుభవంతో ఒడిషా, ఈశాన్య రాష్ట్రాల నర్సులతో పాటు తమిళనాడు, కేరళ నర్సులు స్వంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ‘కొవిడ్ ఇన్సూరెన్స్’ను ఆస్పత్రి యాజమాన్యం తరపున అందించేలా ముందుగానే హామీ ఇస్తున్నాయి.

పాజిటివ్ బారిన పడుతున్న నర్సులు..

కరోనా పేషెంట్లకు సేవలందించే సమయంలో చాలా మంది నర్సులు పాజిటివ్ బారిన పడ్డారు. గతేడాది తరహాలో ఈసారి పీపీఈ కిట్ల నిబంధనను కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు పక్కాగా అమలుచేస్తున్నా మరికొన్ని మాత్రం గాలికొదిలేశాయి. దీంతో ఇన్‌పెక్షన్‌కు గురయ్యారు. ఫలితంగా క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఐసీయూ వార్డుల్లో చేరే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో సాధారణంగా ఒక బెడ్‌కు ఒక నర్సు ఉండాల్సిన చోట ఐదారు బెడ్‌లకు కలిపి పని చేయాల్సి వస్తున్నది. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లను నిత్యం పర్యవేక్షిస్తూ ‘సక్షన్’ లాంటి పనులు చేయాల్సి ఉన్నా ఎక్కువ మందిని చూడాల్సి వస్తున్నందున ఇబ్బంది పడుతున్నారు. చివరకు సకాలంలో వారికి తగిన సేవలు అందించలేకపోవడంతో పేషెంట్లు చనిపోతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ పేషెంట్లు ఎక్కువగా చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని సీనియర్ నర్సు ఒకరు వ్యాఖ్యానించారు.

ట్రైనీ నర్సులతో వైద్య సేవలు

నర్సుల కొరతను తీర్చుకోడానికి మార్గం లేకపోవడంతో కొన్ని ఆస్పత్రులు ప్రైవేటు నర్సింగ్ స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలను సంప్రదించి ఫైనల్ ఇయర్ నర్సింగ్ (బీఎస్సీ) కోర్సు చేస్తున్నవారిని సైతం పార్ట్‌ టైమ్ పద్ధతిలో చేర్చుకుంటున్నాయి. నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు ఇది విరుద్ధమైనా మూడో కంటికి తెలియకుండా వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని నర్సులుగా గుర్తించి ఉద్యోగంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ కోర్సు పూర్తికాకున్నా, తగినంత పరిజ్ఞానం లేకున్నా అత్యవసర సేవల్లో సీనియర్ల సాయంతో ఐసీయూ వార్డుల్లో వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. అయితే ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుండడంతో ఎవరు ట్రైనీలో ఉన్నవారో, ఎవరు పూర్తిస్థాయిలో నర్సు అనేది తెలుసుకోవడం పేషెంట్లకు సాధ్యమయ్యే పని కాదు.

డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందికీ కొరతే

పేషెంట్ల తాకిడికి అనుగుణంగా రకరకాల వైద్య పరీక్షలు చేయాల్సి వస్తున్నది. దీంతో లాబ్ టెక్నీషియన్ల మీద కూడా భారం పడింది. పూర్తిగా లాబ్‌లుగా మాత్రమే పనిచేస్తున్న అనేక ప్రైవేటు సంస్థలు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్టులను ఇవ్వడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోంది. ఎక్కువ శాంపిల్స్, తక్కువ మంది సిబ్బంది కారణంతో పాటు ఆ పరీక్ష చేయడానికి పరికరాలు ఉన్నప్పటికీ నాలుగైదు గంటల సమయం తీసుకోవడం ఇందుకు కారణం. ఇదే పరిస్థితి కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ కొనసాగుతోంది. అందుకే అదనపు పరికరాలను కొని అదనపు లాబ్‌లను పెట్టుకుంటే తప్ప మరో మార్గం లేదని గ్రహించిన యాజమాన్యాలు లాబ్ టెక్నీషియన్‌లను సైతం రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాయి.

ప్రైవేటుకన్నా సర్కారుకే మొగ్గు

కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో తక్కువ జీతానికి ఎక్కువ పని చేయాల్సిన డిప్రెషన్ పరిస్థితుల్లో చాలా మంది సర్కారు ఆస్పత్రుల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనైనా చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే గచ్చిబౌలిలోని ’టిమ్స్ ’ ఆస్పత్రిలో కేవలం 32 నర్సు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తే దాదాపు మూడు వేలకు పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వాటిని ఫిజికల్‌గా సమర్పించాల్సి ఉన్నందున ఆస్పత్రి ఆవరణలో రద్దీ నెలకొంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో లాఠీ ఛార్జీ చేయాల్సినంతటి పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోకంటే జీతం కాస్త ఎక్కువ ఉండడం, భవిష్యత్తులో రెగ్యులర్ చేసే పరిస్థితి వస్తే వెయిటేజీ మార్కులు కలుస్తాయన్న ఆశ అందుకు కారణం. దీనివలన కూడా కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయడానికి నర్సులు ఉత్సాహం చూపడంలేదు.

Advertisement

Next Story

Most Viewed