సీఎం సభలో ఆ ముగ్గురు మంత్రులేరి..?

by Shyam |
సీఎం సభలో ఆ ముగ్గురు మంత్రులేరి..?
X

తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముగింపుకు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరుకాలేదు. వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు. వేదిక మీద మంత్రులందరూ ఉన్నా ఈ ముగ్గురు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే స్టేడియంలోని ప్రజలు ఒక్కరొక్కరుగా వెళ్ళిపోవడం మొదలైంది. దీంతో వెనక వరుసల్లో జనం లేఖ ఖాళీగా దర్శనమిచ్చాయి.

సీఎం ఎదుట టీఆర్ఎస్ నాయకుల నిరసన

మరోవైపు 130వ డివిజన్‌కు సంబంధించిన పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి ప్లకార్డులతో నిరసన తెలిపారు. “మన పాలన మనకే అన్నావ్… మన పదవులు మనకే అన్నావ్… 130వ డివిజన్ టికెట్ తెలంగాణేతరులకు ఇచ్చావ్.. ” అంటూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఇది ముఖ్యమంత్రి దృష్టిలో పడిందో లేదోగానీ సమీపంలో ఉన్న పోలీసులు పరుగున వచ్చి బ్యానర్‌ను లాగేసుకుని వాటిని ప్రదర్శించిన పార్టీ కార్యకర్తలను ఆవరణ నుంచి బైటకు పంపారు.

అభిమానుల నుంచి కనిపించని స్పందన

సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి తెలంగాణ ప్రజలేకాక పక్క రాష్ట్రంలోని ప్రజలు కూడా చాలా ఆసక్తి కనబరుస్తారు. ఆయన పంచ్‌లు, డైలాగులను వినడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో చేసిన ప్రసంగంలో మాత్రం అలాంటివి కనిపించకపోవడంతో హాజరైన కార్యకర్తలు, ప్రజల ఈలలు, చప్పట్లు కనిపించలేదు. బీజేపీని తిట్టినప్పుడు, విమర్శలు చేసినప్పుడు మాత్రం కొంత జోష్ కనిపించింది. పిట్టకథలు, సామెతలు లేకపోవడంతో కార్యకర్తల్లో నీరసం కనిపించింది. బీజేపీని టార్గెట్ చేసే విధంగా, ఇన్ని రోజులూ చేసిన విమర్శలకు దీటుగా బదులిస్తారని ఆశించిన కార్యకర్తలకు నిరుత్సాహమే మిగిలింది. గతంలో ఎన్నడూ ఇంత పేలవంగా ఎన్నికల ప్రసంగం లేదని ఆ పార్టీ కార్యకర్తలే సభ ముగిసిన తర్వాత చర్చించుకున్నారు.

Advertisement

Next Story