ముహూర్తం.. ఇప్పుడు మిస్సయితే ఆర్నేళ్లు ఆగాల్సిందే..

by srinivas |   ( Updated:2020-11-01 11:44:37.0  )
ముహూర్తం.. ఇప్పుడు మిస్సయితే ఆర్నేళ్లు ఆగాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి నెలకొంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోలాహలమే కనిపిస్తోంది. వివాహాల కోసం ఫంక్షన్ హాళ్లు ఆరునెలల కిందటే బుక్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. శుభకార్యాలకు అవసరమయ్యే ఐటమ్స్ షాపులకు వెళ్లి తేవాలంటే ఆలస్యం అవుతుందని, ఆన్ లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు కొందరు. అంతా అర్జంట్‌గా, ఆగమేఘాల మీద చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని 2020 మార్చి 23 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లోనే గడిపింది. సరిగ్గా పెళ్ళిళ్ల సీజన్ సమయం కావడం, దానికితోడు లాక్‌డౌన్ వలన చాలా మంది తమ పిల్లల పెళ్లిళ్లు, శుభకార్యాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ ఏడాది ముహుర్తాలు కూడా లాక్‌డౌన్‌లోనే వెళ్ళిపోయాయి. మంచి ముహుర్తాలు ఉండే ఏప్రిల్, మే నెలల్లో అడపాదడపా పెళ్లిళ్లు జరిగినా.. చాలా మంది తక్కువ మందితో పెళ్లిళ్లు చేసుకోవడం ఇష్టం లేక , కరోనా భయంతో శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు, లాక్‌డౌన్ ఎత్తేయడం, మళ్లీ మంచి రోజులు రావడంతో శుభకార్యాలు మళ్లీ జోరందుకున్నాయి.

శుభకార్యాలు ఎక్కువగా వైశాఖ, జేష్ట, శ్రావణం, మాఘమాసం, కార్తీక మాసంలో నిర్వహించడం అనేది అనవాయితీ(సెంటిమెంట్)గా వస్తుంది. ఈ రెండు మాసాల్లో ఏ కార్యం తలపెట్టినా మంచి జరుగుతుందని పండితులు, పూజారులు సెలవిస్తుంటారు. హిందూ సంప్రదాయం నుంచి వచ్చిన వ్యక్తులైతే జాతకాలు, రాశులు, గ్రహబలాలను ఎక్కువగా విశ్వసిస్తుంటారు. మంచిరోజుల్లో మాత్రమే ఏ పని అయినా చేయడానికి సిద్ధపడుతుంటారు. ఇక ఆషాడం మాసం(శూన్య మాసం)లో ఏ పని అయినా తలపెట్టేందుకు వెనకడుకు వేస్తారు. ప్రస్తుతం దసరా పండుగ తర్వాత (నవంబర్‌‌లో-9, డిసెంబర్‌ నెలలో -10) ముహుర్తాలు మాత్రమే ఉండటంతో ఇన్నిరోజులు వాయిదా పడిన శుభకార్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే పూర్తిచేయాలని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆత్రుతగా ఉన్నారు.

అందుకు కారణం 2021 జనవరి 8 తర్వాత మంచిరోజులు లేకపోవడమే అని జ్యోతిష్కులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో రెండు సార్లు మౌడ్యం(మూడాలు) రావడమే అని తెలిపారు. అందువల్లే ఈలోపే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలని అటు తల్లిదండ్రులు తెగ ఉబలాటపడుతున్నారు. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో మంచి ముహుర్తాలు ఉంటాయి. కానీ, 2021లో అందుకు భిన్నంగా రెండు మూడాలు వెనువెంటనే వస్తున్నాయి. ఈసారి (గురు మౌడ్యమి, శుక్ర మౌడ్యమి) ఒకదాని తర్వాత మరొకటి రోజుల వ్యవధిలోనే వస్తున్నాయి. 2021 జనవరి 14 నుంచి గురుమౌడ్యమి ప్రారంభమై ఫిబ్రవరి -12 ముగుస్తుంది. మరల రెండు రోజుల వ్యవధిలోనే ఫిబ్రవరి -13 మధ్యాహ్నం నుంచి శుక్రమౌడ్యమి ప్రారంభమై మే-4 వ తేదీన ముగుస్తుంది.

సాధారణంగా ప్రతి ఏడాది ఆషాడం, భాద్రపద మాసాల్లో ఈ మూడాలు వచ్చివెళ్తుంటాయి. కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ మూడాలు రావడంతో దాదాపు 120 రోజులు అనగా మే-5తేదీ తర్వాతనే ఎలాంటి శుభకార్యాలైనా చేపట్టాల్సి ఉంటుంది. అప్పటివరకు ఎలాంటి గృహప్రవేశాలు, పెళ్ళిళ్లు, వ్యాపార ప్రారంభాలు వంటివి చేయరాదని.. ఒకవేళ చేస్తే అవి ఆశించినంత కలసి రాకపోవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు. అందువల్లే చాలా మంది తమ పిల్లలకు ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వివాహాలు జరిపేందుకు ఆరాటపడుతున్నారు. ఈ ఒక్క కారణం వల్లే తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల శోభ సంతరించుకుంది.

Advertisement

Next Story