ఐపీఎల్‌: ప్రేక్షకులకు నో ఎంట్రీ

by Anukaran |   ( Updated:2021-03-08 08:48:26.0  )
IPL
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌కు ప్రభుత్వం అనుమతి ఇస్తే 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు జై షా తెలిపారు. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించేదే లేదని చైర్మన్ బ్రిజేష్ పటేల్ తేల్చి చెప్పారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో సీజన్ మొత్తానికి ప్రేక్షకులను దూరం పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. రెండేళ్ల తర్వాత ఇండియాలో ఐపీఎల్ నిర్వహిస్తుండటంతో క్రికెట్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కానీ బ్రిజేష్ పటేల్ ప్రకటన వారి ఆనందాన్ని నీరుగార్చింది. మరోవైపు ఐపీఎల్ చైర్మన్ ప్రకటనతో ఫ్రాంచైజీలు కూడా గుర్రుగా ఉన్నాయి.

IPL fans

నష్టపోనున్న ఫ్రాంచైజీలు..

కరోనా కారణంగా గత సీజన్ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. ప్రేక్షకులను అనుమతించకుండానే మూడు వేదికల్లో ఐపీఎల్ నిర్వహించడంతో ఫ్రాంచైజీలు గేట్ రెవెన్యూ కోల్పోయాయి. హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా ప్రతీ ఫ్రాంచైపీ ఏడాదికి రూ. 25 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు ఆదాయాన్ని అర్జించేవి. ప్రతీ హోం గ్రౌండ్‌లో 8 మ్యాచ్‌లు ఉండేవి. దీంతో ఆయా యాజమాన్యాల పెట్టుబడిలోకొంత మొత్తం గేట్ రెవెన్యూ రూపంలో తిరిగి వచ్చేది. గత ఏడాది యూఏఈలో నిర్వహించడంతో ఫ్రాంచైజీలకు ఈ ఆదాయం రాలేదు. ఇప్పుడు ఇండియాలోనే నిర్వహిస్తున్నా.. ప్రేక్షకులను అనుమతించమని తేల్చి చెప్పడంతో భారీ మొత్తంలో ఫ్రాంచైజీలకు నష్టం కలుగనున్నది. ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా.. ఏ జట్టు కూడా తమ సొంత గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడకుండా ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రేక్షకులను అనుమతిస్తే.. ఇతర జట్ల మ్యాచ్‌లకు అయినా ప్రేక్షకులు వచ్చి కొంత ఆదాయాన్ని తెచ్చిపెడతారనుకున్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ నిర్ణయం నిరాశ కలిగించింది.

ఏదో ఒక పరిష్కారం చూపండి..

కరోనా కారణంగా బయోబబుల్ వాతావరణంలో ఉండటం వల్ల ఫ్రాంచైజీలకు ఆర్థిక భారం ఎక్కువైందని.. ఇప్పుడు ప్రేక్షకుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పోతే మరింత కష్టాలు ఎదురు కాక తప్పదని ఫ్రాంచైజీలు అంటున్నాయి. తొలి అర్దభాగంలో కాకపోయినా.. సగం తర్వాత అయినా ప్రేక్షకులను అనుమతించమని బీసీసీఐను కోరుతున్నాయి. ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే స్పాన్సర్లు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని.. కాబట్టి ఆర్థికంగా నష్టం లేకుండా నిర్ణయం తీసుకోవాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. కనీసం రూ. 25 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవడం అంటే అది భారమేనని యాజమాన్యాలు అంటున్నాయి. అయితే.. త్వరలో జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చిస్తామని బ్రిజేష్ పటేల్ అంటున్నారు. ఫ్రాంజైజీలు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Next Story