- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూలింగ్ పార్టీకి నో రూల్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికార పార్టీ, నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లపై జీహెచ్ఎంసీ, ఈవీడీఎం విభాగాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. నగరంలో చిరు వ్యాపారులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థలు ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్‌లకు భారీగా జరిమానాలు విధించిన ఈవీడీఎం… అధికార పార్టీ నేతల విషయంలో చూసీచూడనట్టుగా ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిటీలో హోర్డింగ్‌ల విషయంలో అధికార పార్టీ నాయకుల పట్ల ఒకలా.. ఇతరుల పట్ల మరోలా వ్యవహరిస్తూ పారదర్శకంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ, న్యూస్‌బ్యూరో : నగరంలో హోర్డింగ్‌ల నియంత్రణకు ప్రత్యేకంగా కార్యచరణను ప్రారంభించి జీహెచ్ఎంసీ ఆరు నెలల నుంచి ఈవీడీఎం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. ఈవీడీఎం బృందాలు తీసిన ఫొటోల ద్వారా చలాన్లు జనరేట్ చేస్తున్నారు. సుమారు వెయ్యి మందికి పైగా రూ. కోటిన్నర వరకూ జరిమానా విధించినట్టు గతంలో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఓ సందర్భంలో వెల్లడించారు. ఇందులో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులు, హాస్టళ్లు, సామాజిక సేవా సంస్థలు, స్టడీ సర్కిళ్లు సైతం ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగ్‌లను గుర్తించేందుకు ఈవీడీఎం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. గల్లీల్లో టిఫిన్ సెంటర్లు, శిక్షణా కేంద్రాలు, చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న వాల్ పోస్టర్లు సైతం కనిపెడుతున్న ఈవీడీఎంకు.. అధికార పార్టీ నేతలు ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లు కనబడకపోవడం గమనార్హం.
నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లపై జరిమానా విధించేందుకు ఈవీడీఎం ప్రత్యేక బృందాలతో పాటు నగర ప్రజలకు సైతం అవకాశం కల్పించారు. పౌరులెవరైనా గుర్తించిన హోర్డింగ్‌ల ఫొటోలను లొకేషన్‌తో ట్విట్టర్ ఖాతాలో పంచుకోవాలని కోరారు. ఈవీడీఎం ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ అవుతున్న ఫొటోల్లో అధికార పార్టీకి చెందినవే ఎక్కువగా ఉండటం విశేషం. గతంలో పలు సందర్భాల్లో, వేడుకల్లో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లపై అనేక విమర్శలు రావడంతో జరిమానా విధించక తప్పలేదు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ వేల సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోర్డింగ్, ఫ్లెక్సీలు ఉన్నా వాటిని కనీసం తొలగించేందుకు కూడా జీహెచ్ఎంసీ ప్రయత్నించకపోవడం గమనార్హం. ఏ మూలనో, గల్లీల్లో ఉన్నాయనుకుంటే ఏమో అనుకోవచ్చు గానీ.. ప్రధాన చౌరస్తాల్లో, రోడ్ల మీద ఉన్న హోర్డింగ్‌లను సైతం గుర్తించలేని స్థితిలో జీహెచ్ఎంసీ, ఈవీడీఎం ఉన్నాయంటే ఆలోచించాల్సిందే.. అంబర్‌పేట, 6 నెంబర్ చౌరస్తాలో అధికార పార్టీ నేత ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఏడాది ప్రారంభం నుంచి కనిపిస్తోంది. ఉప్పల్ నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఫిల్లర్లను సైతం అధికార పార్టీ నేతలు వదలడం లేదు. ఉప్పల్ చెరువు దగ్గర నుంచి బోడుప్పల్ కమాన్ వరకూ ప్రతీ ఫిల్లర్‌పై ఫిర్జాదీగూడ మేయర్ ఫొటోలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినా జీహెచ్ఎంసీకి కనిపించడం లేదు. లాక్‌డౌన్ కంటే ముందు నుంచే వరంగల్ హైవే రూట్‌లో పదుల సంఖ్యలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను గుర్తించలేదంటే జీహెచ్ఎంసీ, ఈవీడీఎం పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జరిమానా సంగతి పక్కన పెట్టినా.. నెలలు గడుస్తున్నా కనీసం వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.