నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఓన్లీ లాఠీ‌ చార్జ్..!

by Anukaran |   ( Updated:2023-05-19 11:13:28.0  )
నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఓన్లీ లాఠీ‌ చార్జ్..!
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేయడానికి అనేక రంగాల్లో పాలకులు ప్రత్యేక శైలిని ప్రారంభించారు. కొత్త రాష్ట్రం కావడంతో ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్’ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీంతో మునుపెన్నడూ లేనట్టుగా పోలీస్ శాఖ విస్తృతమైన ప్రచారాన్ని సొంతం చేసుకుంది. అయితే గత ఆరేళ్లకు పైగా రాష్ట్ర పోలీసులు లాఠీలను పట్టుకుని విధులు నిర్వహించిన దాఖలాలు పెద్దగా లేవనే చెప్పాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కన్పిస్తున్నట్టు బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్వహించిన ‘లాఠీ డ్రిల్’ తెలియజేస్తోంది. పోలీసులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడిన తర్వాత డిపార్ట్‌మెంట్‌లు, ఆస్తులు, ఉద్యోగులు తదితర అంశాలలో సర్దుబాటు కావాల్సి ఉండటంతో కొంత సమయం పడుతోందని అందరూ భావించారు. అధికారం చేపట్టిన టీఆర్ఎస్ కూడా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం పేరుతో సర్దుబాటుకు గడువు కావాలని ప్రజలను, ప్రతిపక్షాలను కోరిన సందర్భాలూ ఉన్నాయి. అందుకు ప్రతిపక్షాలు సైతం మౌఖికంగా అంగీకరించాయి. ఇదే క్రమంలో ప్రజా సమస్యలపై నిరసనలు తెలిపే ఇందిరాపార్కు ధర్నా‌చౌక్ వద్ద ధర్నాలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకనుగుణంగా పోలీసులు సైతం ధర్నాలు చేసేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఎవరైన నిరసన తెలియజేసేందుకు కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం కూడా పెద్దగా కన్పించలేదు.

ప్రస్తుతం పెరుగుతున్న నిరసనలు

ఇటీవల రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి. కేసీఆర్ కుటుంబానికి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీకి వచ్చిన ఫలితాలు చేదు అనుభావాన్నే మిగిల్చింది. ఈ రెండు ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను రాబట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ సాధించింది. రానున్న ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొనే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఇటీవల ఏదో ఒక వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ పరిణామాలతో విపక్షాల కంటే కూడా దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగుతున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ విధానాలపై గుర్రుగా ఉన్నాయి.

ఆందోళనలు అణిచివేసేందుకు..

రాష్ట్రంలో నిరసన పరిణామాల నేపథ్యంలో వాటిని అణిచివేయడానికి పోలీసులు మళ్లీ లాఠీ పట్టుకుని విధులు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల డీజీపీ మహేందర్ రెడ్డి సైతం బాధితుల పట్లనే ఫ్రెండ్లీ పోలీస్ కానీ, నేరస్థుల పట్ల కఠినంగానే ఉంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఈ ఆరేళ్ల కాలంలో ఎన్నడూ లేనిదీ హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల మెలుకువలు, లాఠీ చార్జ్ సమయంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పెషల్‌గా ప్రాక్టీస్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బుధవారం సోషల్ మీడియాలో విడుదలైన పోలీసుల లాఠీ చార్జ్ ప్రాక్టీస్ ఫొటోలు, వీడియోలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ప్రాక్టీస్ ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారమే అంటూ డ్రిల్ చేపట్టే ఇన్‌చార్జ్ అధికారి చెప్పడంతో రాబోయే రోజుల్లో తెలంగాణ పోలీసులు ఎలాంటి వ్యుహాంతో ఉంటారనేది స్పష్టమవుతోంది.

Advertisement

Next Story