‘కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌’లో దావూద్ ఇబ్రహీం లింక్..?

by Sumithra |
‘కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌’లో దావూద్ ఇబ్రహీం లింక్..?
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలో కలకలం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతంలో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉన్నదని ఓ న్యాయస్థానంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అనుమానించింది. నిఘా వర్గాల సమాచారం ఈ అనుమానాలను బలపరుస్తున్నదని కోర్టుకు వివరించింది. సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి అందించినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ కేసులో అరెస్టయిన ఓ నిందితుడు రమీస్ తనకు టాంజానియాలో డైమండ్ వ్యాపారమున్నట్టు తెలిపారని, టాంజానియాలో దావూద్ ఇబ్రహీంకు చెందిన వజ్రాల వ్యాపారాన్ని దక్షిణ భారతానికి చెందిన ‘ఫెరోజ్’ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు అమెరికా రిపోర్టులు తెలిపాయని ఎన్ఐఏ వివరించింది. అందుకే 180 రోజులపాటు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన అవసరమున్నదని పేర్కొంది.

దౌత్యమార్గాల్లో భారత్‌కు చేరిన సుమారు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో జులైలో అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసులోని పది మంది నిందితులకు కఠిన షరతులతో కూడిన బెయిల్‌ను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు మంజూరు చేసింది. పదేళ్ల పూచీకత్తుతోపాటు నిందితులు రాష్ట్రం దాటొద్దని, ప్రతి ఆదివారం పోలీసు స్టేషన్‌కు హాజరవ్వాలని ఆదేశించింది.

ఎన్ఐఏ రిపోర్టు బయటకు రాగానే ప్రతిపక్షాలు సర్కారుపై తీవ్ర విమర్శలుచేశాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితులకు డీ(దావూడ్) కంపెనీ, ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న తమ అనుమానాలను ఎన్ఐఏ రిపోర్టు నిజం చేసిందని, ప్రస్తుతం కేరళ సర్కారు స్మగ్లర్లను రక్షిస్తున్నదని బీజేపీ కేరళ యూనిట్ చీఫ్ కే సురేంద్రన్ ఆరోపించారు. కేరళ సీఎంగా కొనసాగే నైతిక హక్కును పినరయి విజయన్‌కు లేదని, ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed