మార్కెట్లోకి భారీ ఇంజిన్‌తో ట్రయంప్ కొత్త బైక్!

by Shyam |   ( Updated:2020-09-10 07:32:45.0  )
మార్కెట్లోకి భారీ ఇంజిన్‌తో ట్రయంప్ కొత్త బైక్!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటిష్ ప్రీమియం బైకుల తయారీ సంస్థ ట్రయంప్ గురువారం తన మోటార్‌సైకిల్‌లో అతిపెద్ద ఇంజిన్‌తో అమర్చిన రాకెట్ 3 జీటీని విడుదల చేసింది. భారత మార్కెట్లో దీని ధర రూ. 1.84 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త బైక్‌తో ట్రయంప్ ప్రీమియం విభాగంలో మొత్తం 13 బీఎస్6 మోటార్‌సైకిళ్లను కలిగి ఉంది. కొత్త బైక్ రాకెట్ 3జీటీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, రోడ్ గ్రిప్, రైడింగ్ సామర్థ్యం, అధునాతన పనితీరుని కలిగి ఉందని ట్రయంప్ మోటార్‌సైకిల్ ఇండియా బిజినెస్ హెడ్ షోయెబ్ ఫరూక్ చెప్పారు.

ప్రీమియం విభాగంలో అత్యధికంగా 12 వేరియంట్లతో పాటు కొత్త రాకెట్ 3జీటీ రోడ్‌స్టర్, టూరింగ్ వేరియంట్‌లను కలిగి ఉందని ఆయన వెల్లడించారు. రాకెట్ 3జీటీ 2500సీసీ ట్రిపుల్ మోటార్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. డ్రై సంప్ కలిగిన లూబ్రికేషన్ సిస్టమ్ ఈ బైక్ భారీ ఇంజిన్‌లో ఉపయోగించడం వల్ల మునుపటి తరం కంటే 18 కిలోల ఇంజిన్ బరువు ఆదా అవుతుందని, మొత్తంగా ఇంతకుముందు బైకుల కంటే 40 కిలోల తేలిగ్గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కాగా, అమెరికాకు చెందిన మరో ప్రీమియం మోటార్‌సైకిల్ కంపెనీ హార్లే డెవిడ్‌సన్ తక్కువ అమ్మకాల కారణంతో 11 ఏళ్ల తర్వాత భారత్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story