రేషన్ కార్డులు ఇస్తలే..

by Shyam |
రేషన్ కార్డులు ఇస్తలే..
X

ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. ఈ కార్డు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవు. ఇంత ప్రాధాన్యత కల్గి ఉన్న వీటిని జారీ చేయడంలో అధికార యంత్రాంగం, సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కార్డుల కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు 25 వేల దరఖాస్తులు అధికారులకు అందాయి. దరఖాస్తు చేసుకుని ఏడాది దాటుతున్నా వారిని నేటికీ రేషన్ కార్డు మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఒకటి, రెండు రోజులు కాదు. ఏకంగా ఏడాదిన్నర నుంచి రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ఆహార భద్రత కార్డుల(రేషన్ కార్డులు)ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం, అంత్యోదయ కార్డులు కల్గిన వారికి 35 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రేషన్ కార్డులు అత్యవసరంగా మారాయి. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి రూ.1500 నగదును ప్రభుత్వం అందించింది. దీంతో రేషన్ కార్డుల అవసరం మరింతగా పెరిగింది. ఏడాదిన్నరగా అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ఒక్కటంటే.. ఒక్క కార్డు సైతం మంజూరు చేయలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 25,402 దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్నా వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

జిల్లాల వారీగా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9,88,124 రేషన్ కార్డులు ఉన్నాయి. కేవలం నల్లగొండ జిల్లాలో 4,57,353 రేషన్ కార్డులు ఇప్పటికే ఉండగా, గతేడాది నుంచి 13,720 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 3,16,799 కార్డులు ఉంటే.. కొత్తగా 7,322 దరఖాస్తులు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,13,972 కార్డులుండగా కొత్తగా 4,960 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే గతేడాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను నిలిపివేశామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

బోగస్ కార్డుల ఏరివేత పేరుతో..

కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బోగస్ కార్డుల ఏరివేతను సాకుగా చూపుతోంది. రాష్ట్రంలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం బోగస్ కార్డులను ఏరివేయాలని నిర్ణయించింది. ఇది మంచిదే కానీ ఏడాదిన్నరగా బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియను పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో గతేడాది జూన్‌లో అధికారులు సంబంధిత సైట్‌ను పూర్తిగా నిలిపేశారు. బోగస్ కార్డులు ఉన్న మాట వాస్తవమే కావొచ్చు. కానీ కార్డులు జారీ కాకపోవడంతో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలకు అందడం లేదు.

నష్టపోతున్న అర్హులు

ఏడాదిన్నర కాలంగా కొత్త‌రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో అర్హులు తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇటు రేషన్ కార్డులు లేక.. చేసేందుకు పని దొరక్క చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ సరుకులే కాకుండా ఇతర సేవలూ పొందలేకపోయారు. ప్రభుత్వం పథకాలే కాక, ఉన్నత చదువులు, ఆరోగ్య శ్రీ, బ్యాంకు సబ్సిడీ రుణాలన్నీ బీపీఎల్ కార్డుతో అనుసంధానం చేశారు. ఫలితంగా అర్హత ఉన్నా సబ్సిడీ రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. కొందరు చనిపోయినా కార్డుల నుంచి వారి పేరును తొలగించడం లేదు. మరి కొందరు అనర్హులు కార్డులను కలిగి ఉన్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారు సైతం కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాల కంటే కార్డుల సంఖ్య ఎక్కవుగా ఉంటున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దరఖాస్తుల వివరాలు..

జిల్లా దరఖాస్తులు
యాదాద్రి 4960
సూర్యాపేట 7322
నల్లగొండ 13,720
మొత్తం 25,402

Advertisement

Next Story