ఇన్‌స్టాగ్రాం రీల్స్ ఫీచర్.. ఎగబడుతున్న టిక్‌టాకర్లు

by Harish |
ఇన్‌స్టాగ్రాం రీల్స్ ఫీచర్.. ఎగబడుతున్న టిక్‌టాకర్లు
X

ప్రముఖ ఫొటోషేరింగ్ సోషల్ మీడియా యాప్.. ఇన్‌స్టాగ్రాంలో కొత్తగా రీల్స్ ఫీచర్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత వారం రోజులుగా మరుగున పడి ఉన్న టిక్‌టాకర్ల ఆశలకు జీవం పోసినట్టయింది. చైనా యాప్‌‌ల నిషేధంలో భాగంగా టిక్ టాక్ యాప్‌ కూడా నిషేధానికి గురికావడంతో చాలా మంది టిక్‌టాకర్లు బాధపడ్డారు. కానీ రీల్స్ వారిలో ఉత్సాహన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇలా లాంచ్ అయిందో లేదో అందరూ క్యూలు కట్టేసి వీడియోలు పెట్టేస్తున్నారు. దీంతో టిక్ టాక్‌ను ద్వేషించే వాళ్లందరూ కథ మళ్లీ మొదటికి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అచ్చం టిక్ టాక్ లాంటి ఫీచర్లతోనే ఈ ఇన్‌స్టాగ్రాం ఫీచర్ పనిచేస్తుండటం విశేషం.

అయితే తక్కువ సమయంలోనే దానికి వచ్చిన పాపులారిటీని చూసి ఇన్‌స్టాగ్రాం కూడా త్వరలో టిక్ టాక్‌లా మారిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా జరగడానికి ముందే ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా వేరే విడి యాప్‌ మాదిరిగా విడుదల చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ‘ఫీల్ ఇట్, రీల్ ఇట్’ అంటూ ఇప్పటికే ఒక హ్యాష్‌ట్యాగ్‌ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా రీల్స్ ఫీచర్‌ను ఉపయోగించి వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. అవే వీడియోలకు అప్పుడే వినియోగదారుల నుంచి అనుకరణలు రావడం కూడా జరుగుతోంది. ఇక టిక్ టాక్ లేని లోటును రీల్స్ తీర్చుతుందన్న ధైర్యం రావడంతో టిక్ ‌టాకర్లు అందరూ తమ పాత ఫ్యాన్ బేస్‌ను తిరిగి ఇన్‌స్టాగ్రాం యాప్‌కు రప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే టాలెంట్‌ను నమ్ముకున్న వాడికి ప్లాట్‌ఫామ్ కొదువ ఉండదనే నమ్మకం మాత్రం కలుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed