- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారం కోసం రెండు నెలలు ఆగాల్సిందే?
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ రాజకీయ వేడి చల్లబడింది. ఏ పార్టీకి ఎంత బలముందో తెలిపోయింది. బల్దియాలోని 150 కార్పొరేటర్లు గెలిచారు. గెలిచిన ఆనందంతో మరో రెండు నెలలు ఎదురుచూడక తప్పదు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరిలో ముగిస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో ప్రస్తుత కార్పొరేటర్లకే అధికారిక గుర్తింపు లభించనుంది. గతంలో ఎప్పుడులేని విధంగా జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలు నిర్వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు వింత అనుభవం ఎదురవుతోంది. రాజకీయ పార్టీలతో పోటాపోటీ ఎన్నికల్లో గెలుపొందినా.. పది రోజులుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి విశ్రాంతి లేకుండా పనిచేసి గెలుపొందిన ఆనందం వారిలో నిలవడం లేదు. సిట్టింగ్ కార్పోరేటర్ల విషయంలో పెద్దగా తేడా ఏమీ అనిపించకున్నా..కొత్తగా కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో ఆ ఉత్సాహం, ఆనందాన్ని అనుభవించే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం 2021 ఫిబ్రవరి 10 తో ముగియనుంది. అయితే ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడంతో ప్రస్తుతమున్నపాలకమండలి ముగిసే వరకూ ఎన్నికయిన కొత్త కార్పొరేటర్లు ఎదురుచూడక తప్పడం లేదు. సాధారణంగా జీహెచ్ఎంసీ పాలకమండలి ముగియడం కంటే ముందు మూడు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. సాధారణంగా నెల రోజుల్లోపు వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహిస్తూ పాలక మండలి ప్రమాణ స్వీకరం వెంటవెంటనే ముగిస్తుండటంతో ఎవరికీ ఇబ్బందిగా ఉండేది కాదు.
అయితే ఈ సారి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే అయినప్పటికీ చాలా ముందుగా ఎన్నికలకు వెళ్లింది. మూడు నెలల ముందే పాలక మండలి ఎన్నికయినపుడు ఏమి చేయాలన్నదానిపై ఇప్పుడు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. పాత పాలక మండలిని రద్దు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలేమీ లేవని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జీహెచ్ఎంసీ సీనియర్ ఆఫీసర్ తెలిపిన ప్రకారం.. ప్రస్తుత సిట్టింగ్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసే వరకూ కొత్త కార్పొరేటర్లు వేచి ఉండక తప్పదు. అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రస్తుత మున్నవారికే ప్రోటోకాల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు ఇలా ముందుగా ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు లేకపోవడంతో కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకూ పాత బోర్డును ఏం చేయాలన్నది తెలియడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన సిట్టింగ్ కార్పొరేటర్లకు ఇబ్బంది అనిపించకపోయినా కొత్తగా డివిజన్లను గెలుచుకున్న కార్పొరేటర్లు కౌన్సిల్‌లో అడుగుపెట్టేందుకు ఎదురు చూస్తున్నారు.
150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 149 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 54 మంది మాత్రమే సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారు. మిగిలిన 96 మంది కొత్తగా కార్పొరేటర్లుగా ఎన్నికయిన వారే. మొదటిసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో అడుగుపెడుతున్నామన్న ఆనందం వీరికి రెండు నెలల తర్వాత దక్కనుంది. ప్రధాన పార్టీల తరపున బరిలో నిలిచిన.. సిట్టింగ్‌లను, ప్రత్యర్థులను ఓడించి విజయోత్సహంలో ఉన్న కొత్త కార్పొరేటర్లు వెంటనే రంగంలోకి దిగాలని ఉత్సాహంగా ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా వేచి ఉండక తప్పడం లేదు. ఈ రెండు నెలల పాటు జరిగే అధికారిక కార్యక్రమాల్లో వీరికి ఎలాంటి గుర్తింపు లభించే అవకాశాలు లేవు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగేటపుడు వీరంతా సామాన్య జనం మాదిరిగానే చూడాల్సి వస్తుంది.
తమ డివిజన్ల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోకపోవడంతో పాటు పాతవారే ముందు నడుస్తుంటే వీరి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాము గెలిచినప్పుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేమన్న అసంతృప్తిలో కొత్త కార్పొరేటర్లు ఉంటారు. ఈ రెండు నెలల కాలాన్ని అధికారులు ఏ విధంగా గడుపుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. ఎన్నికలంటూ జరిగాక పాత వారి పదవి కోల్పోయినట్టు మానసికంగా భావిస్తారు. కొత్తగా గెలిచినవారు సైతం ఆ డివిజన్లలో తామే ప్రథమ పౌరులుగా మారిపోతారు. అయినప్పటికీ సిట్టింగ్ కార్పొరేటర్లే ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. కొత్త, పాత కార్పొరేటర్ల మధ్య ఏ విధంగా సమన్వయం సాధిస్తారన్నది ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారుల ముందున్న అతి పెద్ద సవాల్.