వరకట్న దాహానికి నవ వధువు బలి..

by Sumithra |   ( Updated:2021-01-03 07:57:32.0  )
వరకట్న దాహానికి నవ వధువు బలి..
X

దిశ సూర్యాపేట: సూర్యాపేటలో వరకట్న దాహానికి ఓ నవవధువు బలి అయింది. వివాహమై ఐదు నెలలైనా గడవకముందే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వివాహమైన కొత్తల్లో బాగా చూసుకున్న భర్త… క్రమంగా దూరం పెట్టడంతో పాటు వరకట్నం తీసుకునిరావాలంటూ వేధించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రణయ్‌ అనే వ్యక్తి.. నల్గొండ జిల్లా కొర్లపాడుకు చెందిన లావణ్య అనే యువతిని ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెండ్లికి ముందు బాగా చూసుకున్న ప్రణయ్‌, వివాహం జరిగినప్పటి నుంచి లావణ్యను వేధించసాగాడు. అదనపు కట్నం తీసుకు రమ్మని ఒత్తిడి చేశాడు. ప్రేమించి పెండ్లి చేసుకున్న వ్యక్తి నమ్మించి మోసం చేశాడని తీవ్ర మనస్థాపానికి గురైన లావణ్య శనివారం పురుగుల మందు సేవించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా… చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

కాగా తమ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కట్నకానుకలు ముట్టజెప్పామనీ మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అదనపు కట్నం కావాలంటూ ప్రణయ్‌ వేధించాడని వారు ఆరోపించారు. తమ బిడ్డ చావుకు ప్రణయ్‌ వేధింపులే కారణమని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఆమె పురుగుల మందు సేవించే ముందు భర్తతో ఫోనులో మాట్లాడింది. ‘నన్ను ఎందుకు దూరం పెట్టావు… ఎక్కడ ఉన్నావ్‌… నేను పురుగుల మందు తాగాను’ అంటూ లావణ్య చివరగా భర్తతో మాట్లాడింది. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్యా యత్నం…
భార్య లావణ్య మరణం తట్టుకోలేక ప్రణయ్ ఆదివారం ఆత్మహత్య యత్నం చేశాడు. దీనికి సంబంధించి ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ప్రణయ్ బంధువుల వివరాల ప్రకారం…నూతన సంవత్సరం సందర్భంగా తమ ఇంటికి రావాలని లావణ్య తండ్రి ప్రణయ్‌ను ఆహ్వానించాడు. దీంతో ప్రణయ్ తన భార్యను అత్త గారి ఇంటి దగ్గర కొర్లపహాడ్ గ్రామంలో దింపి వచ్చాడు. కాగా లావణ్యను ఇంట్లో ఆమె సవతి తల్లీ, చెల్లెళ్లు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దీంతో మనస్థాపానికి గురై లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ప్రణయ్ హాస్పిటల్‌కు వెళ్లగా… లావణ్య బంధువులు వరకట్నం కింద వేదించావు అని ప్రణయ్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దీంతో ప్రణయ్ మనస్థాపానికి గురై ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి. నా భార్య దగ్గరకి నేను పోతున్నా, నా భార్య దగ్గరే నన్ను కూడా పెట్టండి. నా భార్య చావుకు, నా చావుకు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. చావైనా.. బ్రతుకైనా నీతో నే లావణ్య’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రణయ్‌ను హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

Next Story