ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఇంత నిర్లక్ష్యమా.. బయటపడ్డ అధికారుల నిర్వాకం

by Shyam |
ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఇంత నిర్లక్ష్యమా.. బయటపడ్డ అధికారుల నిర్వాకం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ జిల్లాలో ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్సరం ప‌రీక్షల నిర్వహణ‌లో నిర్లక్ష్యపు సంఘ‌ట‌న సోమ‌వారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వ‌రంగ‌ల్ మ‌ట్టెవాడ ఎల్లంబజారులోని మ‌హ‌బూబీయా ప్రభుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో విద్యార్థుల‌ను అర్ధగంట ఆల‌స్యంగా ప‌రీక్ష హాలులోకి అనుమ‌తివ్వడం గ‌మ‌నార్హం. అంతేకాదు దాదాపు 20నిముషాల ముందుగానే ప‌రీక్షా హాలు నుంచి విద్యార్థుల‌ను వెళ్లగొట్టిన‌ట్లుగా విద్యార్థుల ద్వారా తెలిసింది. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు దిశ‌కు వెల్లడించిన వివ‌రాల ప్రకారం.. ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్సరం ప‌రీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి 12గంట‌ల మ‌ధ్య మూడు గంట‌ల‌పాటు స‌మ‌యం కేటాయించారు.

అయితే వ‌రంగ‌ల్ మ‌హ‌బూబీయా క‌ళాశాలలో ప‌రీక్షకు సంబంధించిన ఏర్పాట్లలో వైఫ‌ల్యం క‌నిపించింద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప‌రీక్షకు దాదాపు 15 నిముషాల ముందే హాలులోకి విద్యార్థులను అనుమ‌తించాల్సిన అధికారులు.. బెంచీల‌ను శుభ్రం చేస్తూ, నెంబ‌ర్లు వేస్తూ క‌నిపించిన‌ట్లుగా తెలిపారు. ఉద‌యం 9:20త‌ర్వాత ప‌రీక్ష హాలులోకి అనుమ‌తించ‌గా ప‌రీక్ష ప్రశ్నప‌త్రాల పంపిణీ, ఇత‌ర‌త్రాకు దాదాపు మ‌రో ప‌ది నిముషాలు వృథా చేశార‌ని విద్యార్థులు తెలిపారు. ఆల‌స్యంగా ప‌రీక్షను ప్రారంభించిన అధికారులు త‌గిన స‌మ‌యాన్ని పొడిగించాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా 11:40 త‌ర్వాత పేప‌ర్లను క‌లెక్ట్ చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ప‌రీక్షల‌ను ప‌ర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహావేశాల‌ను వ్యక్తం చేస్తున్నారు. ఇదే విష‌యంపై ఆర్‌జేడీతో మాట్లాడేందుకు దిశ య‌త్నించ‌గా ఫోన్ లిఫ్ట్ చేయ‌లేదు.

Advertisement

Next Story

Most Viewed