కేసీఆర్ మాటకే విలువ లేదా.. ‘నామ్ కే వాస్తు’గా పనులు కానిస్తున్న అధికారులు

by Sridhar Babu |   ( Updated:2021-07-06 05:55:54.0  )
pattana Pragati
X

దిశ, జనగామ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు జనగామ జిల్లాలో నామ్కే వాస్తుగా కొనసాగుతున్నట్లు కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ప్రగతి పనులు జిల్లా కేంద్రంలో అరకొర సిబ్బందితో కొనసాగుతున్నాయి. పలు వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభానికి సైతం నోచుకోలేదు. గతంలో నాటిన మొక్కలకు రక్షణ కరువైంది. నాటిన మొక్కలను రక్షించేందుకు మున్సిపల్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కలు నాటిన ప్రాంతాల్లో మళ్ళీ మొక్కలను నాటేందుకు అధికారులు తగుచర్యలు తీసుకున్నా ఫలితాలు పెద్దగా కనబడటం లేదు. పట్టణ ప్రగతికి ప్రభుత్వం అందించిన నిధులు సరిపోవడం లేదని కౌన్సిలర్స్ సైతం వార్డు ప్రగతిపై పెద్దగా ఆసక్తి చూపించని దాఖలాలున్నాయి.

50 శాతం పుర్తికాని ప్రగతి పనులు.. మిగిలింది నాలుగు రోజులే..

జనగామ మున్సిపాలిటీ 30 వార్డులుగా అవతరించింది. ఇందులో నూతనంగా విలీనమైన వార్డులను అధికారులు పట్టించుకోవడం లేదని, సానిటేషన్‌కు కావాల్సిన సిబ్బంది అరకొరగా ఉన్నారని, అరకొర సిబ్బందితోనే ప్రగతి పనులు చేపట్టడం ద్వారా అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్ట లేకపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలో 50 శాతం అభివృద్ధి కూడా పూర్తి కాలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం మిగిలింది నాలుగురోజులే ఉండటంతో.. ఈ నాలుగు రోజుల్లో అధికారులు ఏమాత్రం పనులు చేస్తారో వేచి చూడాలని పలువురు నేతలు వాపోతున్నారు.

తాజాగా జరిగిన ప్రగతి పనుల్లో ప్రధాన వార్డుల్లోనే పనులు కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీకి కావాల్సిన జేసీబీలు, డోజర్లు అందుబాటులో లేవని అధికారులు సాకులు చెబుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. శివారు వార్డుల్లో దోమల విజృంభనతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ ప్రగతిలో మున్సిపాలిటీ సిబ్బందికి స్థానిక యువత, నాయకులు చేయూతనివ్వడంతోనే ఈమాత్రం పనులు కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. నెలల కొద్దీ పేరుకుపోయిన చెత్తను పది రోజుల్లో తీయాలంటే అధికారులకు ఒక ఛాలెంజ్‌గా మారింది. దీంతో జిల్లా అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటికీ పట్టణ ప్రగతి పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం.

నాటిన మొక్కలకు రక్షణ కరువు..

గతంలో నాటిన మొక్కలకు నీరు పోసి.. వాటిని పెంచే వారు కరువయ్యారని, నిర్లక్ష్యం చేసిన వార్డులపై తగుచర్యలు తీసుకోకపోవడంతో గతంలో నాటిన మొక్కల్లో 20 శాతం కూడా పెరిగిన దఖలాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం వాటి స్థానాల్లోనే కొత్త మొక్కలను నాటేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా నాటిన మొక్కలకు అధికారులు, వార్డు ప్రజలు, వాటర్ మ్యాన్స్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

janagoan

janagoan1

janagoan2

janagoan3

Advertisement

Next Story

Most Viewed