PM Modi: అందరికీ న్యాయం జరిగేలా చూడటమే క్రిమినల్ చట్టాల ఉద్దేశం

by S Gopi |
PM Modi: అందరికీ న్యాయం జరిగేలా చూడటమే క్రిమినల్ చట్టాల ఉద్దేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలోని ఎర్రకోటపై 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతి నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.. వైమానిక దళం మొదలుకొని అన్ని రంగాల్లోనూ మహిళలు దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. అన్నిచోట్ల అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి విజయాలు నారీశక్తికి ఉన్న శక్తి, స్పూర్తికి నిదర్శనం. రానున్న రోజుల్లో దేశ పురోగతికి మహిళలు అందిస్తున్న విశేషమైన సహకారానికి మద్దతిస్తూ, వేడుకలు జరుపుకుందామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగం చేసే మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ప్రధాని చెప్పారు.

మహిళలను గౌరవించడమే కాదు, వారి కోసం అవసరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాం. తల్లి తన బిడ్డను స్వచ్ఛమైన పౌరునిగా పెంచేందుకు ప్రభుత్వం ఆటంకంగా మారకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. అలాగే, గడిచిన పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని, ఆర్థిక స్వాతంత్ర్యం పొందారన్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడు ఇంటి నిర్ణయాల్లో చురుకుగా పాల్గొని, సామాజిక మార్పునకు సహాయకులవుతారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 9 లక్షల కోట్లు కేటాయించినట్టు మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని ఘటనలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. 'మన తల్లులు, సోదరీమణులపై జరిగే దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాటిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సమాజం తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై జరిగే దాడి కేసుల దర్యాప్తు ప్రక్రియ వేగంగా చేపట్టాలి. నిందితులకు కఠిన శిక్షలు ఉండాలి. దీనివల్ల సమాజంలో విశ్వాసం పెరుగుతుందని ' మోడీ పేర్కొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story