అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం

by GSrikanth |
అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా ఆయన ఇంకా హకీంపేటలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో(ఎన్ఐఎస్ఏ) సీఐఎస్ఎఫ్ బలగాల రైజింగ్ పరేడ్ అనంతరం ఆయన 11:50 గంటలకు కొచ్చిన్‌కు బయలుదేరాల్సి ఉంది. కాగా, సాంకేతిక లోపాల కారణంగా ఆయన ఇంకా వెళ్లలేకపోయారు. ఆయన వెళ్లేందుకు మరో అరగంటకు పైగా సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అమిత్ షాకు వీడ్కోలు పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెళ్లారు. కాగా, ఫ్లైట్ సాంకేతిక సమస్యతో ఆలస్యం కావడంతో ఆ ముగ్గురు నేతలతో అమిత్ షా భేటీ అయినట్లు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్లు సమాచారం. కాగా, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ అంశాలపై అమిత్ షా ముగ్గురు నేతలతో చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి బీజేపీ ముఖ్య నేతలతో శనివారం రాత్రే ఆయన భేటీ కావాల్సి ఉంది. కానీ ఢిల్లీ నుంచి ఆయన రావడమే ఆలస్యం కావడంతో ఆయన తన భేటీని వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఎంతో సీరియస్ గా పనిచేస్తోంది. అందుకుగాను తెలంగాణ పర్యటన ఉన్న ప్రతిసారి స్థానిక తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీస్తుంటారు. కానీ ఈసారి సమయం లేకపోవడంతో వాయిదా వేసుకున్నా.. అనుకోకుండా ఫ్లైట్‌కు సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన బండి, లక్ష్మణ్, కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే దాదాపు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఇంకా ఏయే అంశాలను ప్రస్తావించారనేది అంతుచిక్కడంలేదు.

Advertisement

Next Story