Union Budget :ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి జాబ్స్.. రూ.2 లక్షల కోట్లతో కేంద్రం ప్లాన్

by Hajipasha |   ( Updated:2024-07-23 17:56:06.0  )
Union Budget :ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి జాబ్స్.. రూ.2 లక్షల కోట్లతో కేంద్రం ప్లాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పన, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రంగం, స్టార్టప్‌లు, ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక దృష్టితో కూడిన బలమైన ప్రణాళికను వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలతో కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం.. ‘‘భారత్‌లో ద్రవ్యోల్బణం ఇంకా తక్కువగా, స్థిరంగానే ఉంది. అది 4 శాతం దిశగా కదలాడుతోంది. ఇంధనం, ఆహార సరుకులతో కూడిన కోర్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 3.1 శాతం వద్ద ఉంది’’ అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే దేశంలోని వస్తువులు, సేవల ధరల్లో సంభవించే మార్పు. అయితే ఇందులో ఫుడ్, ఎనర్జీ వంటి కీలక రంగాలు ఉండవు. ‘‘వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నైపుణ్యాలను పెంచడం అనేది ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ ఏడాది విద్య, ఉద్యోగ, స్కిల్ డెవలప్మెంట్ విభాగాలపై రూ.1.48 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నాం’’ అని ఆర్థికశాఖ వివరించింది.

‘మోడల్ స్కిల్ లోన్ స్కీం’ రుణ పరిమితి పెంపు

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణను అందించనున్నారు. దేశంలోని 1000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తారు. మోడల్ స్కిల్ లోన్ స్కీం ద్వారా సాంకేతిక నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు అందించే రుణ పరిమితిని రూ.7.50 లక్షలకు పెంచారు. దీని ద్వారా ఏటా 25వేల మంది విద్యార్థులు లబ్ధిపొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విద్యార్థుల ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.ఈక్రమంలో ఏటా లక్ష మంది విద్యార్థులకు ఈ-వోచర్ల జారీ ద్వారా 3 శాతం దాకా వడ్డీ రాయితీని ఇస్తారు. ఇప్పటికే అమల్లో ఉన్న పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, నేషనల్ లైవ్లీ హుడ్ మిషన్, స్టాండప్ ఇండియా పథకాలను విస్తరించనున్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఏపీ, బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశాల వికాసం కోసం ‘పూర్వోదయ’ స్కీంను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వ్యవసాయ రంగం కోసం ఇవీ..

‘‘వచ్చే ఐదేళ్లలో అత్యధిక దిగుబడిని ఇచ్చే 109 పంటల వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులకు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేషన్, బ్రాండింగ్‌ను మంజూరు చేస్తారు. రైతలకు దన్నుగా నిలిచేందుకు దాదాపు 10వేల బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు’’ అని కేంద్రం వెల్లడించింది. ‘‘పప్పులతో పాటు పొద్దు తిరుగుడు, సోయాబీన్, ఆవాలు, నువ్వుల వంటి పంటల సాగును పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఆ పంటల నిల్వ, మార్కెటింగ్ సదుపాయాలను రైతులకు కల్పిస్తుంది. మూడేళ్లలోగా రైతులందరిని భూముల వివరాలను డిజిటలైజ్ చేస్తారు. ఈ ఏడాదికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు దాదాపు రూ.1.52 లక్షల కోట్లను కేటాయించారు.

బంగారం, వెండిలపై 6 శాతం చొప్పున బీసీడీ తగ్గింపు

బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ)ని బంగారం, వెండిలపై 6 శాతం చొప్పున, ప్లాటినంపై 6.4 శాతం మేర కేంద్రం తగ్గించింది. పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లపై బీసీడీని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. వాటి వల్ల పర్యావరణ కాలుష్యం ప్రబలుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అప్పీళ్ల దశలో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ వివాదాల పరిష్కారం కోసం ‘వివాద్ సే విశ్వాస్’ స్కీంను కేంద్రం ప్రకటించింది. రూ.60 లక్షల దాకా విలువ కలిగిన ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్ పన్నులు, సర్వీస్ ట్యాక్సులకు సంబంధించిన అప్పీళ్లను హైకోర్టులలో దాఖలు చేయొచ్చు. రూ.2 కోట్ల దాకా విలువ కలిగిన అప్పీళ్లను సుప్రీంకోర్టులో, రూ.5 కోట్ల దాకా విలువ కలిగిన అప్పీళ్లను ట్రైబ్యునళ్లలో దాఖలు చేయొచ్చు.

Advertisement

Next Story

Most Viewed