మా హిందుత్వానికి, బీజేపీ హిందుత్వానికి చాలా తేడాఉంది: ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు

by samatah |
మా హిందుత్వానికి, బీజేపీ హిందుత్వానికి చాలా తేడాఉంది: ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమ హిందుత్వానికి, బీజేపీ హిందుత్వానికి చాలా తేడా ఉందని తెలిపారు. మా హిందుత్వం ఇంట్లో పొయ్యిలు వెలిగిస్తుంటే..కాషాయ పార్టీ హిందుత్వం మాత్రం ఇళ్లను తగలబెడుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ముస్లిం జనాభా పెరగడం ఆయన విజయమా, వైఫల్యమా అన్న విషయాన్ని స్పష్టం చేయాలి. ముస్లింల జనాభా పెరుగుదలపై మోడీని అభినందించాలా, విమర్శించాలా అనే విషయమై అయోమయం నెలకొంది’ అని వ్యాఖ్యానించారు.

‘మోడీ ప్రభుత్వం శివసేన పార్టీకి వ్యతిరేకంగా భారత ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించింది. విల్లు, బాణం గుర్తును లాక్కుంది. మా పార్టీని, చిహ్నాన్ని, మనుషులను లాక్కుంది. అయినప్పటికీ ఉద్ధవ్ థాక్రేకు భయపడుతోంది’ అని తెలిపారు. ప్రధాని న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. మోడీ డ్రామా జూన్ 4 వరకు మాత్రమే కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా హిందువులు ముస్లింల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష సరిగా లేదని..దాని వల్ల దేశానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed