త్వరలో విపక్షాలు కూర్చునేది విజిటర్స్ గ్యాలరీలోనే : మోడీ

by Hajipasha |   ( Updated:2024-02-05 14:34:13.0  )
త్వరలో విపక్షాలు కూర్చునేది విజిటర్స్ గ్యాలరీలోనే : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఎక్కువ కాలం కూర్చోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడయిందనే నమ్మకం తనకు ఉందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పెట్టుకున్న గొప్ప సంకల్పాన్ని అభినందిస్తున్నానని చమత్కరించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల పాటు ఇక్కడ (ప్రభుత్వంలో) కూర్చుంది.. అచ్చం అదేవిధంగా ఇప్పుడు అక్కడ(ప్రతిపక్షంలో) కూర్చుంది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత ఎత్తులను అధిరోహిస్తుంది. ఆ పార్టీ నాయకులంతా పార్లమెంటులోని ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చోవాల్సి వస్తుంది’’ అని ప్రధాని మోడీ విమర్శించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని మోడీ సోమవారం సమాధానమిస్తూ ప్రసంగించారు. ‘‘రాష్ట్రపతి మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి ఈ కొత్త పార్లమెంటు భవనానికి వచ్చినప్పుడు సెంగోల్‌తో సాదరంగా స్వాగతించాం. మనమంతా గర్వంగా చారిత్రక సెంగోల్ వెంట నడుస్తున్నాం. ఆ పవిత్ర క్షణానికి మనమంతా సాక్షులుగా నిలిచాం. కొత్త పార్లమెంటు భవనంలో ఈ కొత్త సంప్రదాయానికి తెరతీయడం ద్వారా ప్రజాస్వామ్యంపై మనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నాం’’ అని ప్రధాని తెలిపారు.

నేను అతిపెద్ద ఓబీసీని.. మీకు కనిపించడం లేదా ?

‘‘మీకు (ప్రతిపక్షాలు) ఓటమి భయం పట్టుకుంది. మీలో (ప్రతిపక్షాల్లో) చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోవడాన్ని నేను చూస్తున్నాను. గతసారి కూడా చాలామంది సీట్లు మార్చుకున్నారు. ఈసారి కూడా చాలామంది తమ సీట్లు మార్చుకోవాలని చూస్తున్నారని విన్నాను. ఇంకొంత మంది లోక్‌సభకు బదులుగా రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారట. పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చి ఎవరికివారుగా తమతమ మార్గాలను వెతుక్కుంటున్నారు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.‘‘ప్రతిపక్ష నాయకులు మారారు.. కానీ మాట్లాడే విషయం మాత్రం మారలేదు. దేశ ప్రజలకు సరైన సందేశాన్ని పంపడంలో విపక్షం విఫలమైంది. ప్రతిపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం. మంచి ప్రతిపక్షంగా అవతరించే అవకాశం వచ్చినా కాంగ్రెస్‌ వాడుకోలేకపోయింది’’ అని మోడీ తెలిపారు. ‘‘ఒకే ప్రోడక్టును పదేపదే విడుదల చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు మూతపడే దశకు చేరుకుంది. పార్టీకి సంబంధించిన నిర్ణయాలను ఒక కుటుంబం తీసుకునే పరిస్థితి ఉండటం మంచిది కాదు. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యానికి హానికరం’’ అని ఆయన చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కానీ.. యూపీఏ ప్రభుత్వం కానీ ఓబీసీలకు తగిన న్యాయం చేయవు. కొద్ది రోజుల క్రితం కర్పూరీ ఠాకూర్‌కు మేం భారతరత్న ప్రకటించాం. 1970లో కర్పూరీ ఠాకూర్ బిహార్ సీఎం అయినప్పుడు.. ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కాంగ్రెస్ పార్టీ నానా కుట్రలు చేసింది. ఎందుకంటే ఆ పార్టీ ఓబీసీలను సహించలేదు. ప్రభుత్వంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారనే లెక్కలు చూస్తుంటుంది. మీకు (కాంగ్రెస్) ఇక్కడ అతిపెద్ద ఓబీసీ కనిపించడం లేదా ?’’ అని ప్రధాని ప్రశ్నించారు.

క్యాన్సిల్ కల్చర్‌లో కూరుకుపోయిన కాంగ్రెస్

‘‘కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ కల్చర్‌లో కూరుకుపోయింది. మేం మేక్ ఇన్ ఇండియా అంటుంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అంటోంది. మేం ఆత్మనిర్భర్ భారత్ అంటుంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అంటోంది. మేం లోకల్‌కి వోకల్ అంటుంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అంటోంది. ఎంతకాలమని ఇంత ద్వేషం పెంచుకుంటారు. , మీరు మన దేశం సాధించిన విజయాలను కూడా రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారా ?’’ అని కాంగ్రెస్‌కు ప్రధాని ప్రశ్నలు సంధించారు. ‘‘2014లో యూపీఏ సర్కారు మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన టైంలో ఆనాటి ఆర్థికమంత్రి ప్రసంగిస్తూ.. జీడీపీ పరంగా భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. అది గర్వించదగ్గ విషయమన్నారు. మూడుదశాబ్దాల తర్వాత (2044 నాటికి) భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు. దీన్నిబట్టి ఆ పార్టీల విజన్ ఎంత పేలవంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అని ప్రధాని విరుచుకుపడ్డారు. ‘‘మేం మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చాక పెద్ద నిర్ణయాలను తీసుకుంటాం. వచ్చే వెయ్యేళ్లకు సరిపడా విజన్ ఆ నిర్ణయాల్లో ప్రతిబింబిస్తుంది. రాబోయే 100 సంవత్సరాల కోసం దేశానికి బలమైన పునాదిని వేయడమే మా తదుపరి లక్ష్యం’’ అని మోడీ స్పష్టం చేశారు. ‘‘నేడు దేశంలో ఎంత వేగంగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో కాంగ్రెస్ ఊహించలేకపోతోంది. పేదల కోసం మేం 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. వాటిలో 80 లక్షల పక్కా ఇళ్లు పట్టణ పేదల కోసం కట్టించాం. ఈ పనులన్నీ పూర్తి చేయించడానికి కాంగ్రెస్ పాలనలోనైతే 100 సంవత్సరాలు పట్టేవి. 100 తరాలు గడిచిపోయేవి’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed