Thamilnadu crime:తమిళనాడులో మరో పొలిటికల్ లీడర్ హత్య.. 24గంటల్లోనే రెండో ఘటన

by vinod kumar |
Thamilnadu crime:తమిళనాడులో మరో పొలిటికల్ లీడర్ హత్య.. 24గంటల్లోనే రెండో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో మరో పొలిటికల్ లీడర్ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలోని శివగంగైలో సెల్వ కుమార్ అనే బీజేపీ కార్యకర్తను శనివారం రాత్రి కొందరు దుండగులు నరికి చంపారు. శివగంగై బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఉన్న సెల్వకుమార్‌ తన ఇటుక బట్టీ నుంచి బైకుపై ఇంటికి వెళ్తుండగా..కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టి చంపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్‌ను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్వకుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్వకుమార్ హత్యకు నిరసనగా గ్రామస్తులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

సెల్వకుమార్ మృతిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున వారి ఫ్యామిలీని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమిళనాడును హత్యల రాజధానిగా అభివర్ణించారు. సామాజిక వ్యతిరేకులకు ప్రభుత్వానికి, పోలీసులంటే భయం లేదని, పోలీసులను తన అధీనంలో ఉంచుకున్న సీఎం రాజకీయ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఎంకే స్టాలిన్‌కు ఉందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఫైర్ అయ్యారు. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో ఇది రెండో రాజకీయ హత్య కావడం గమనార్హం. అంతకుముందు కడలూరులో ఏఐఏడీఎంకే కార్యకర్తను నరికి చంపారు. అలాగే ఈనెల 5న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను దుండగులు హత్య చేశారు. దీంతో తమిళనాడులో శాంతి భద్రతలపై ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed