PM Modi : దేశాలను ఆదుకుంటామే తప్ప.. అప్పుల ఊబిలో పడేయం: ప్రధాని మోడీ

by Hajipasha |
PM Modi : దేశాలను ఆదుకుంటామే తప్ప.. అప్పుల ఊబిలో పడేయం: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : గ్లోబల్ సౌత్ దేశాలకు ఉగ్రవాదం, అతివాదం నుంచి పెనుముప్పు పొంచి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత, సాంకేతిక వెనుకబాటు వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి వాణిజ్యాన్ని పెంచుకునేందుకుగానూ గ్లోబల్ సౌత్ దేశాలకు తన మౌలిక, సాంకేతిక వనరులను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ తెలిపారు. శనివారం రోజు గ్లోబల్ సౌత్ సదస్సును ఉద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్‌‌కు చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తొలి విడతగా రూ.209 కోట్లతో సోషల్ ఇంపాక్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘డిజిటల్ ఐడీ, డిజిటల్ పేమెంట్స్‌తో ముడిపడిన టెక్నాలజీ కోసం ఇప్పటికే 12 గ్లోబల్ సౌత్ దేశాలు మాతో చేతులు కలిపాయి’’ అని వెల్లడించారు.

పరోక్షంగా చైనాకు చురకలు

‘‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ తనవంతుగా సహకరిస్తుంది. సహాయం కోరే దేశాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తుంది. అలా అని.. అప్పుల ఊబిలో వాళ్లను పడవేయం. మాలాగే వాళ్లు కూడా వికసించాలని భావిస్తాం’’ అని మోడీ స్పష్టం చేశారు. చైనా భారీగా అప్పులు ఇచ్చి పలు దేశాలను అప్పుల ఊబిలో పడవేసిన అంశాన్ని ఈవిధంగా పరోక్షంగా భారత ప్రధాని ప్రస్తావించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య వికాసానికి రూ.20 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. వాణిజ్య విధానాలు, చర్చలపై ఆయా దేశాల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.8 కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘గ్లోబల్ సౌత్ దేశాలకు చౌకగా జనరిక్ మందులు అందిస్తాం. సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన టెక్నాలజీని సమకూరుస్తాం’’ అని మోడీ తెలిపారు.

ఆఫ్రికా, పసిఫిక్ దేశాల్లో జన ఔషధి కేంద్రాలు

ఆరోగ్య మైత్రి కార్యక్రమంలో భాగంగా ఆఫ్రికా, పసిఫిక్ దేశాల్లో జన ఔషధి కేంద్రాలను భారత్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. గాజా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు కూడా తమ మానవతా సాయం అందిందన్నారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించడం వెనుక భారత్ కృషి ఉందని పేర్కొన్నారు. ‘‘గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య గ్యాప్ తగ్గాలి. సెప్టెంబరు 22 నుంచి 23 వరకు ఐక్యరాజ్యసమితిలో జరగనున్న ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’‌లో దీనికి సంబంధించిన దిశానిర్దేశం లభిస్తుంది’’ అని భారత ప్రధాని చెప్పారు.

Advertisement

Next Story