Tejashwi : పదవీ విరమణ వయసు 60 ఏళ్లు.. 75 ఏళ్ల సీఎం కావాలా?

by Shamantha N |
Tejashwi : పదవీ విరమణ వయసు 60 ఏళ్లు.. 75 ఏళ్ల సీఎం కావాలా?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ (Bihar) సీఎం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) విరుచుకుపడ్డారు. నితీశ్ అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. ఆయన్ని పాత వాహనంతో పోల్చారు. బిహార్ ప్రజలు అసమర్థ ప్రభుత్వాన్ని వద్దని కోరుతున్నారని చెప్పారు. పదవీ విరమణ వయసు 60గా ఉంటుందని గుర్తుచేస్తూ.. 75 ఏళ్ల సీఎం కావాలా..? అంటూ.. బిహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం అలసిపోయారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. డొక్కు వాహనంతో ముందుకు వెళ్లలేం. సరికొత్త దృక్పథంతో అభివృద్ధి సాధించాలి. నితీశ్ రిటైర్‌ అయ్యారు. ఆయనకు అసలు తన హయాంలో ఉన్న డిప్యూటీ సీఎంల పేర్లు కూడా గుర్తు లేవు. త్వరలోనే మా సర్కారు ఏర్పడుతోంది’’ అని పేర్కొన్నారు.

అసెంబ్లీలో లొల్లి

అంతకుముందు, అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్వీ యాదవ్‌పై నీతీశ్ కుమార్‌ మండిపడ్డారు. గతంలో బిహార్ పరిస్థితిని వివరిస్తూ.. తేజస్విపై విమర్శలు గుప్పించారు. తన కారణంగానే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు. ఆయనకు అండగా ఎందుకు నిలుస్తున్నారని లాలూ సొంత మనుషులే అడిగారని చెప్పారు. అయినా, లాలూకు తాను మద్దతు ఇచ్చానంటూ పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు నితీశ్‌పై లాలూ కుమారుడు తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అసెంబ్లీలో సైతం నితీశ్ పై తేజస్వి విరుచుకుపడ్డారు. నితీశ్ ని విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆయన కింద పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed