Supreme Court : ఖనిజాలు, గనులపై ​​రాయల్టీ హక్కు రాష్ట్రాలదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by vinod kumar |   ( Updated:2024-07-25 10:18:21.0  )
Supreme Court : ఖనిజాలు, గనులపై ​​రాయల్టీ హక్కు రాష్ట్రాలదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖనిజాలు, గనులు ఉన్న భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం ప్రకారం పన్నులు వసూలు చేయడానికి రాష్ట్రాల అధికారాలను పరిమితం చేయలేదని తెలిపింది. ఈ మేరకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. తీర్పును 8:1 మెజారిటీతో అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందా లేదా అనే విషయం తేల్చాలని కోరుతూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్ కంపెనీల తరపున సుప్రీంకోర్టులో 86 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం గతంలో ఎనిమిది రోజుల పాటు విచారణ చేపట్టింది. అనంతరం మార్చి 14న తీర్పును రిజర్వ్ చేసి తాజాగా వెల్లడించింది.

మైనింగ్ ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేది రాయల్టీ పన్ను కాదని, ఖనిజాల వెలికితీత కోసం చేసే కాంట్రాక్టు చెల్లింపు మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. కాబట్టి ఖనిజ హక్కులపై అదనపు లెవీ, సర్‌చార్జి విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని పేర్కొంది. రాజ్యాంగంలోని జాబితా IIలోని ఎంట్రీ 50 ప్రకారం ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు1989లో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీంతో ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారాన్ని కొనసాగించాలని ఆశించిన కేంద్రానికి ఈ జడ్జిమెంట్‌తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నిర్ణయం దేశమంతా ఖనిజ వనరుల నిర్వహణపై గణనీయమైన ప్రభావం చూసే అవకాశం ఉంది.

అయితే ఈ తీర్పుపై జస్టిస్ బీబీ నాగరత్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. పన్నులు వసూలు చేసే హక్కు రాష్ట్రాలకు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. గనులు, ఖనిజాలు ఉన్న భూములపై ​​పన్నులు విధించే శాసనాధికారం రాష్ట్రాలకు లేదని తెలిపారు. పన్ను విధించేందుకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమని, దేశంలోని ఖనిజాభివృద్ధికి ప్రమాదకరమని నొక్కి చెప్పారు. ఈ అంశంపై మరోసారి జూలై 31న స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం అంగీకరించింది.

Advertisement

Next Story