పెళ్లి ప్రపోజల్‌ను నెరవేర్చకపోవడం చీటింగ్ కాదు : సుప్రీంకోర్టు

by Hajipasha |
పెళ్లి ప్రపోజల్‌ను నెరవేర్చకపోవడం చీటింగ్ కాదు : సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : పెళ్లి ప్రతిపాదనను నెరవేర్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళను మోసం చేశాడనే అభియోగంతో కర్ణాటకకు చెందిన రాజు కృష్ణ షెడ్‌బాల్కర్‌‌పై నమోదైన చీటింగ్‌ కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాజు కృష్ణ షెడ్‌బాల్కర్‌‌, అతడి కుటుంబ సభ్యులు తమను మోసం చేశారని ఆరోపిస్తూ సదరు మహిళ 2021లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రాజు కృష్ణను తగిన వరుడిగా భావించిన తన తండ్రి పెళ్లి వేదిక బుక్‌ చేసేందుకు రూ.75,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఆమె హైకోర్టుకు తెలిపింది. అయితే రాజు కృష్ణ మరో మహిళను పెళ్లాడినట్లు తమకు తర్వాత తెలిసిందని పేర్కొంది. పెళ్లి ప్రతిపాదనను పూర్తి చేయనందుకే ఆ వ్యక్తి, అతడి కుటుంబంపై చీటింగ్ కేసు వేసినట్లు చెప్పింది. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు.. రాజు కృష్ణ తప్ప మిగతా కుటుంబ సభ్యులపై చీటింగ్‌ కేసును కొట్టేసింది. దీంతో రాజు కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. వివాహ ప్రతిపాదన ఆశించిన ముగింపునకు రాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని బెంచ్ అభిప్రాయపడింది. మోసం చేయాలనే ఉద్దేశం రాజు కృష్ణకు ఉందని నిరూపించే ఆధారాలు లేనందున అతడిపై నమోదైన చీటింగ్‌ కేసును కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed