Student dies: స్పీచ్ ఇస్తూ స్టేజిపైనే కుప్పకూలిన విద్యార్థిని.. మహారాష్ట్రలో విషాద ఘటన

by vinod kumar |   ( Updated:2025-04-06 14:21:02.0  )
Student dies: స్పీచ్ ఇస్తూ స్టేజిపైనే కుప్పకూలిన విద్యార్థిని.. మహారాష్ట్రలో విషాద ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఇటీవల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ 20 ఏళ్ల విద్యార్థిని సైతం తమ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నవ్వుతూ మాట్లాడుతుండగా స్టేజీపైనే కుప్పకూలి మృతి చెందింది. మహారాష్ట్ర (Maharashtra)లోని ధారాశివ్ (Dharashiv) జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఆర్జీ షిండే కళాశాలలో చివరి బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న వర్ష ఖరత్(20)అనే విద్యార్థిని కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌లో ప్రసంగిస్తోంది. ఈ క్రమంలోనే స్టేజీపైనే అకస్మాత్తుగా కుప్పకూలింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను పరాండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే విద్యార్థిని మరణించినట్టు వైద్యులు తెలిపారు. విద్యార్థిని గుండె పోటు కారణంగానే ప్రాణాలు కోల్పో్యినట్టు ధ్రువీకరించారు. ఆమెకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, దాదాపు ఏడేళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 25వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 50 ఏళ్ల ఓ వ్యక్తి పార్టీలో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలోనూ ఒక పశువైద్యుడు కారు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Next Story

Most Viewed