మూడోసారి అధికారంలోకి వస్తే తొలి 100 రోజుల్లో కీలక నిర్ణయాలు: ప్రధాని మోడీ

by S Gopi |
మూడోసారి అధికారంలోకి వస్తే తొలి 100 రోజుల్లో కీలక నిర్ణయాలు: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడోసారి అధికారం చేపట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన మెగా ర్యాలీలో పాల్గొన్న ప్రధాని ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. 'మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిందని, వచ్చే ఐదేళ్ల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొదిస్తున్నాం. తాము తొలి 100 రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై పనులు వేగంగా జరుగుతున్నాయని' అన్నారు. 'గత పదేళ్లలో మీరు అభివృద్ధికి సంబంధించిన ట్రైలర్‌ను మాత్రమే చూశారు. ఇకమీదట దేశాన్ని తాము మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను. 2024 ఎన్నికలు కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదని, అభివృద్ధి చెందిన భారత్‌ను సన్నద్ధం చేసే ఎన్నికలని' మోడీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ద్వారా భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలుపుతుందన్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతిని ప్రస్తావించిన మోడీ, దేశంలో ఇప్పుడు ఆధునిక మౌలిక సదుపాయాలు వేగంగా నిర్మించబడుతున్నాయి. అన్ని రంగాల్లో యువతకు అనేక అవకాశాలు లభిస్తున్నాయి. మహిళలు సైతం సత్తా చాటుతున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, పేదల సాధికారత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మోడీ తెలిపారు. దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story