ఆ నిర్ణయంతో పర్యాటకంపై తీవ్ర ప్రభావం: మాల్దీవుల మాజీ అధ్యక్షుడి ఆందోళన

by samatah |
ఆ నిర్ణయంతో పర్యాటకంపై తీవ్ర ప్రభావం: మాల్దీవుల మాజీ అధ్యక్షుడి ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య పరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్ కాట్ పిలుపుతో మాల్దీవులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు. మాల్దీవుల ప్రజలకు క్షమాపణలు చెప్పిన నషీద్.. భారతీయులు హాలీడేస్‌లో తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ‘భారత్‌తో దౌత్య వివాదం మాల్దీవులను చాలా ప్రభావితం చేసింది. ఈ పరిస్థితి నెలకొన్నందుకు మాల్దీవుల ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. భారతీయులు మాల్దీవులకు రండి. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలి’ అని వ్యాఖ్యానించారు.

భారత్ బాధ్యతాయుత దేశం

రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబన తొలగి శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భావిస్తున్నట్టు తెలిపారు. భారత్ ఎంతో బాధ్యతాయుత దేశమని వెల్లడించారు. మాల్దీవులతో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ముయిజ్జు తీసుకున్న నిర్ణయంపై ఇరు దేశాలు చర్చించుకోవాలని సూచించారు. మాల్దీవులు-చైనా మధ్య ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందంపై స్పందిస్తూ..ఇరు దేశాల మధ్య కుదిరిన అగ్రిమెంట్ రక్షణ ఒప్పందం కాదని, కేవలం పరికరాల కొనుగోలు మాత్రమేనని తెలిపారు. ‘భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కూడా కలిశాను. నేను ఆయన మద్దతు దారున్ని. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని చెప్పారు.

కాగా, ఇటీవల మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జూ భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాల్దీవుల నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని గడువు విధించారు. అంతేగాక గతంలో భారత్‌తో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ ఒప్పందాన్ని రద్దు చేశారు. చైనాలో పర్యటించి చైనా-మాల్దీవుల మధ్య రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. చైనాకు చెందిన నిఘా నౌకను మాల్దీవులు జలాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story