పార్లమెంట్‌లో సంచలన ఘటన.. సభలో టియర్ గ్యాస్ ప్రయోగించిన ఆగంతకులు (వీడియో)

by Satheesh |   ( Updated:2023-12-13 10:02:24.0  )
పార్లమెంట్‌లో సంచలన ఘటన.. సభలో టియర్ గ్యాస్ ప్రయోగించిన ఆగంతకులు (వీడియో)
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా సరిగ్గా మధ్యాహ్నం 1.01 గంటలకు విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి కిందికి దూకారు. ఎంపీలు కూర్చుకునే బల్లల్లో ఒకదాని మీద నుంచి ఇంకో దాని మీదకు జంప్ చేస్తూ భాష్పవాయువును ప్రయోగించారు. ఆ సమయంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తర మాల్డా ఖగేన్ మర్ము అనే బీజేపీ ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో స్పీకర్ స్థానంలో ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సందర్శకుల తరహాలో విజిటర్ గ్యాలరీలోకి దూకిన ఇద్దరిలో ఒకరిని మార్షల్స్ వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనిని ఆనంద సాగర్‌గా గుర్తించారు.

సరిగ్గా 2001లో డిసెంబరు 13వ తేదీన పార్లమెంటులోకి జొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఇప్పుడు మళ్లీ అదే రోజున ఈ ఘటన చోటుచేసుకున్నది. అప్పటి ఘటనను గుర్తుచేస్తూ అసువులు బాసిన అమరవీరులకు పార్లమెంటు ప్రాంగణంలో నివాళులర్పించిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకున్నది. సభలో ఏం జరుగుతున్నదో అర్థం కాని గందరగోళం నెలకొనడంతో ఏదో అవాంఛనీయ ఘటన జరిగిందనే ఉద్దేశంతో స్పీకర్ స్థానంలో ఉన్న అగర్వాల్ వెంటనే సభను రెండు నిమిషాల పాటు వాయిదా వేశారు. సభలో గందరగోళం సృష్టించిన ఆనంద్ సాగర్‌ను భద్రతా సిబ్బంది బైటకు తీసుకొచ్చారు.

భాష్పవాయువు (టియర్ గ్యాస్) రంగు ఎల్లో కలర్‌లో ఉన్నదని గుర్తించిన భద్రతా సిబ్బంది అది ఏ రకంగా ప్రాణాపాయం సృష్టించి స్వభావం ఉన్నదనే అంశంపై ఆరా తీస్తున్నారు. సభలో గందరగోళం సృష్టించిన ఆ ఇద్దరూ తానాషాహీ నహీ చలేగీ అంటూ నినాదాలు చేశారు.

భద్రతా వైఫల్యం:

సభలోకి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతిస్తారు. కనీసం తాళం చెవి లాంటివి కూడా తీసుకెళ్ళకుండా అక్కడే కౌంటర్‌లో డిపాజిట్ చేయిస్తారు. కానీ చేతుల్లో భాష్పవాయువు ప్రయోగించే ఉపకరణాలను ఎలా లోపలికి తీసుకెళ్ళారనేది కీలకంగా మారింది. భద్రతా వైఫల్యంలో జరిగిన లోపం ఇప్పుడు యావత్తు దేశాన్నే ఉలికిపాటుకు గురిచేసింది.

Advertisement

Next Story