1901 తర్వాత ఇదే రికార్డ్: భారత వాతావరణ శాఖ

by samatah |
1901 తర్వాత ఇదే రికార్డ్: భారత వాతావరణ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది జనవరిలో వాయువ్య భారత్‌లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గత నెల ఈ ప్రాంతంలో 3.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా..1901 తర్వాత ఇది రెండో అతి తక్కువ వర్షపాతం అని వెల్లడించింది. ఇది సాధారణం కంటే 91శాతం తక్కువ కావడం గమనార్హం. అయితే ఫిబ్రవరిలో వేడిగా ఉండే ఈ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక, భారత్‌లో జనవరి నెలలో తక్కువ వర్షాలు కురిశాయని తెలిపింది. దేశం మొత్తం 7.2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా..1901 అనంతరం ఇది తొమ్మిదో అత్యల్పస్థాయి రికార్డు అని పేర్కొంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 58శాతం తక్కువ. వచ్చే నెలలోనూ దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వాయువ్య, ఈశాన్య, మధ్య భారతదేశంలోనూ ఇదే తరహా పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. అయితే దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

ఉత్తరభారత్‌లో భారీ వర్షాలు!

కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు భారీ వర్షాలు లేదా, మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ టైంలో భారీగా చలిగాలులు సైతం వీస్తాయని తెలిపింది. పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఫిబ్రవరి 4వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది.

Advertisement

Next Story