ఎన్ఐఏ చీఫ్‌గా సదానంద్ వసంత్: ఎన్డీఆర్ఎఫ్, బీపీఆర్డీలకూ కొత్త బాస్‌లు

by samatah |
ఎన్ఐఏ చీఫ్‌గా సదానంద్ వసంత్: ఎన్డీఆర్ఎఫ్, బీపీఆర్డీలకూ కొత్త బాస్‌లు
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కొత్త చీఫ్‌గా సదానంద్ వసంత్ డేట్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా పీయూష్ ఆనంద్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ (బీపీఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ కుమార్ శర్మలు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్‌గా నియామకమైన సదానంద్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..ఈనెల 31న పదవీ విమరణ చేయనున్న ప్రస్తుత ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా స్థానంలో సదానంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 2026 డిసెంబర్ 31 వరకు ఎన్ఐఏ చీఫ్‌గా వ్యవహరించనున్నారు.

అలాగే ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్, బీపీఆర్డీ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీ వాస్తవలు కూడా ఈ నెల 31న పదవీ విమరణ చేయనున్నారు. వీరి స్థానంలో కొత్త చీఫ్‌లుగా నియమితులైన పీయూష్ ఆనంద్, రాజీవ్ కుమార్ శర్మలు బాధ్యతలు చేపట్టనున్నారు. పీయూష్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కాగా..ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. రెండేళ్ల పాటు ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించనున్నారు. ఇక, బీపీఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ శర్మ 2026న జూన్ 30 వరకు పదవిలో ఉండనున్నారు.

Advertisement

Next Story