స్మృతి ఇరానీని ఏం అనొద్దు: రాహుల్ గాంధీ

by Harish |
స్మృతి ఇరానీని ఏం అనొద్దు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. స్మృతి ఇరానీపై అవమానకరమైన పదజాలం ఉపయోగించడం గానీ లేదా ఆమె పట్ల అసహ్యంగా ప్రవర్తించడం చేయవద్దని శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులను కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరీ లాల్‌ శర్మ చేతిలో ఓడిపోవడంతో స్మృతి ఇరానీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి వెళ్లిపోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌లో వ్యాఖ్యానించిన రాహుల్, ''జీవితంలో గెలుపు ఓటములు జరుగుతాయి. స్మృతి ఇరానీ లేదా ఏ ఇతర నాయకులపై కూడా అవమానకరమైన పదజాలం ఉపయోగించడం, అసహ్యంగా ప్రవర్తించడం చేయవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను, అవమానించడం బలహీనతకు సంకేతం, బలం కాదని'' రాహుల్ తన పోస్ట్‌లో రాశారు.

అంతకుముందు 2019లో జరిగిన ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మను స్మృతికి పోటీగా దింపగా, ఆయన 1.6 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఆమెపై గెలుపొందారు. దీంతో ఒటమి అనంతరం ఇరానీ ఢిల్లీలో లుటియన్స్‌లోని 28 తుగ్లక్ క్రెసెంట్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. దీంతో ఆమె బంగ్లా ఖాళీ చేయడంపై కొంతమంది ఎగతాళి చేశారు.



Next Story