ప్రధాని మౌన ప్రతిజ్ఞ చేశారేమో.. మోడీపై రాహుల్, జైరాం రమేశ్ విమర్శలు

by Mahesh |   ( Updated:2023-07-15 13:27:57.0  )
ప్రధాని మౌన ప్రతిజ్ఞ చేశారేమో.. మోడీపై రాహుల్, జైరాం రమేశ్ విమర్శలు
X

న్యూఢిల్లీ : మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. "మణిపూర్ మంటల్లో కాలిపోతోందని ఎక్కడో ఉన్న యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటులో చర్చ జరిగింది.మానవ హక్కులపై ఆందోళన వ్యక్తమైంది.. కానీ ప్రధాని మోడీ దానిపై నోరు విప్పకపోవడం, ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం. ప్రధాని మోడీ మౌన ప్రతిజ్ఞ చేశారన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు" అని కామెంట్ చేశారు. మణిపూర్ లో హింస రగులుతున్న క్లిష్ట సమయంలో.. రాఫెల్ జెట్స్ వంకతో ఫ్రాన్స్ దేశపు "బాస్టిల్ డే" పరేడ్‌ లో పాల్గొనేందుకు ప్రధాని వెళ్లిపోయారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా ఈ అంశంపై స్పందించారు. కొన్ని దేశాలు చంద్రుడిపైకి మనిషిని పంపగలుగుతున్నా.. భూమిపై ఉన్న ప్రజల సాధారణ సమస్యలను పరిష్కరించ లేకపోతున్నాయనే సందేశంతో అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ నెల్సన్ 1977లో రాసిన వ్యాసం(ది మూన్ అండ్ ది ఘెట్టో) నేటి భారతదేశ పరిస్థితులకు సరిపోయేలా ఉందన్నారు. ఈ వ్యాసానికి ఇప్పుడు ఇండియా వర్షన్‌ను రిలీజ్ చేస్తే "ది మూన్ అండ్ ది మణిపూర్" అనే టైటిల్ పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story