PM Modi : సునీతా విలియమ్స్ కు ప్రధాని మోడీ లేఖ

by M.Rajitha |
PM Modi : సునీతా విలియమ్స్ కు ప్రధాని మోడీ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Wiliams) ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్(ISS) నుంచి మరికొద్దిసేపట్లో భూమిని చేరుకోనున్నారు. ఈ క్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) సునీతా విలియమ్స్ కు లేఖ రాశారు. సునీతాను భారత్ కు ఆహ్వానిస్తున్నట్టు ప్రధాని లేఖలో పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌ 9 నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి భూమికి తిరిగి రానున్న నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారు ఐఎస్ఎస్ లో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, తమ మనసులకు చాలా దగ్గరగా ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతోపాటు ఆపరేషన్‌ విజయవంతం కావాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత భారత్‌కు రావాలని కోరుకుంటున్నట్లు, తమ బిడ్డకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సంతోషంతో ఎదురుచూస్తోందని మోడీ లేఖలో పేర్కొన్నారు.

కాగా అమెరికా అంతరిక్ష పరిశోధక కేంద్రం నాసా(NASA)లో విధులు నిర్వహిస్తున్న సునీతా విలియమ్స్ మూలాలు భారత్‌లో ఉన్నాయి. ఆమె తండ్రి దీపక్ పాండ్య గుజరాత్‌కు చెందినవారు. 1957లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. దీపక్ పాండ్య దంపతులకు ముగ్గురు సంతానంలో ఒకరైన సునీత అమెరికా నేవీ నుంచి రిటైరయ్యాక 1998 జూన్​లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్‌ఎస్‌లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. 2012లో రెండోసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు. సునీత భర్త మైకేల్‌ జె.విలియమ్స్‌ రిటైర్డ్‌ ఫెడరల్‌ మార్షల్‌. ఇప్పటివరకు సునీతా మూడు సార్లు భారత్​లోని తన తండ్రి స్వగ్రామంలో పర్యటించారు.

Next Story