Pdp party: ఏడాదికి ఉచితంగా 12 గ్యాస్ సిలిండర్లు.. ఓటర్లకు ఆ పార్టీ బంపర్ ఆఫర్!

by vinod kumar |
Pdp party: ఏడాదికి ఉచితంగా 12 గ్యాస్ సిలిండర్లు.. ఓటర్లకు ఆ పార్టీ బంపర్ ఆఫర్!
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు గాను పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) తన ఎన్నికల మేనిఫెస్టోను శనివారం రిలీజ్ చేసింది. 12 హామీలతో కూడిన ఈ మేనిఫెస్టోను శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విడుదల చేశారు. పేద కుటుంబాలకు ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని, దేవాలయాలకు, మసీదులకు, ఇతర పుణ్యక్షేత్రాలను పూర్తిగా ఉచిత విద్యు్త్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక నీటి పన్ను రద్దు, ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యుల వరకు సరిపడా బియ్యం అందజేస్తామని తెలిపారు. పేదలకు రేషన్ సరిగా అందడం లేదని పీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ముఫ్తీ మహ్మద్ సయీద్ పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్‌ను రెట్టింపు చేస్తామని పీడీపీ వెల్లడించింది.

ఆర్టికల్ 370, 35ఏలను పునరుద్దరించేందుకు తోడ్పడతామని, పాకిస్థాన్‌తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించేందుకు కృషి చేస్తానని ముఫ్తీ హామీ ఇచ్చారు. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు (ఏఎఫ్‌ఎస్‌ఏపీఏ), ఉగ్రవాద నిరోధక చట్టం, ప్రజా భద్రతా చట్టం వంటివి తొలగిస్తామని చెప్పారు. కశ్మీరీ పండిట్‌లకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తామన్నారు. అలాగే కశ్మీర్ ప్రజల భూమి, ఉపాధి హక్కులను పరిరక్షించడం, స్థానిక ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి యాపిల్స్‌పై 100 శాతం దిగుమతి సుంకం విధించడం వంటివి మేనిఫెస్టోలో పొందుపర్చారు.

మా ఎజెండాను అంగీకరిస్తే పొత్తుకు సిద్ధం: మెహబూబా ముఫ్తీ

కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తమ ఎజెండాను అంగీకరిస్తే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. ప్రణాళిక ఆధారంగా చర్చలు జరగాలని, కానీ సీట్ల పంపకంపై మాత్రమే చర్చలు జరిగితే తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరబోదని స్పష్టం చేశారు. పొత్తు, సీట్ల పంపకం చాలా దూరమైన విషయాలని తెలిపారు. పీడీపీ మేనిఫెస్టోకు రెండు పార్టీలు మద్దతిస్తే.. అన్ని స్థానాల్లోనూ పోటీ నుంచి తప్పుకుంటామని తెలిపారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని హిందూ పుణ్యక్షేత్రమైన శారదా పీఠ్‌కు వెళ్లే మార్గాన్ని తెరవాలని తమ పార్టీ కోరుకుంటోందని చెప్పారు.

Advertisement

Next Story