గాజాలో ఆక్సిజన్ కొరత: నలుగురు పిల్లల మృతి

by samatah |   ( Updated:2024-02-16 10:18:43.0  )
గాజాలో ఆక్సిజన్ కొరత: నలుగురు పిల్లల మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే ఈ ఘర్షణలో అనేక మంది పిల్లలు మృతి చెందగా.. తాజాగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఖాన్ యూనిస్‌లోని నాజర్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలు మృతి చెందారు. ఈ విషయాన్ని హమాస్ ఆధ్వర్యంలోని గాజా మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ దళాలు ముట్టడించడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. ఆస్పత్రిలోని జనరేటర్లు ఆగిపోయాయని, విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారని పేర్కొంది. ఘర్షణలో భాగంగా సుమారు10,000 మందికి పైగా స్థానభ్రంశం చెందిన ప్రజలు, వందలాది మంది రోగులు వారి కుటుంబ సభ్యులతో సహా ఆస్పత్రిలో ఆశ్రయం పొందారు. ఇజ్రాయెల్ దళా ముట్టడితో వారందరూ ఆస్పత్రిని వదిలి వెళ్ళవలసి వెళ్లారని తెలిపింది. అయితే వైద్య కేంద్రాలను సైనిక అవసరాల కోసం హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రులపై దాడులకు పాల్పడుతోంది. కాగా, ఇప్పటివరకు గాజాలో 28000 మందికి పైగా పౌరులు మరణించారు. గాయపడిన వారి సంఖ్య సుమారు 68,500కి చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలోని 84 శాతం ఆస్పత్రులు ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్‌డబ్లూఏ) తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed