One Rank One Pension: పెన్షన్లలో జాప్యం సరికాదు..కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్

by vinod kumar |
One Rank One Pension: పెన్షన్లలో జాప్యం సరికాదు..కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) స్కీమ్‌కు అనుగుణంగా ఆర్మీలోని రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్‌లకు చెల్లించాల్సిన పెన్షన్‌పై ఏళ్ల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెన్షన్ల చెల్లింపులో కేంద్రం విఫలమైందని, ఇది సరైన పద్దతి కాదని ఫైర్ అయింది. పెన్షన్ సమస్యలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రూ.2లక్షల జరిమానా విధించింది. నవంబర్ 14లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఇదే చివరి అవకాశమని తెలిపింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ అంశం 2021లో సుప్రీంకోర్టుకు చేరిందని, పదే పదే ఆదేశాలు ఇచ్చినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నించింది. రూ. 2 లక్షలు ఆర్మీ సంక్షేమ నిధుల్లో జమ చేయాలని, నవంబర్ 14లోగా నిర్ణయం తీసుకోకుంటే, రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు 10 శాతం పెన్షన్ పెంపునకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది. కేంద్రం తరపున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి మాట్లాడుతూ..ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ (ఏఎఫ్‌టి)కొచ్చి బెంచ్ ఆరు సమస్యలను ఎత్తి చూపిందని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed