లాకప్ నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు.. నిజమేనా ? తేల్చనున్న ఈడీ !!

by Hajipasha |
లాకప్ నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు.. నిజమేనా ? తేల్చనున్న ఈడీ !!
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యాక ఢిల్లీ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వివాదానికి దారితీస్తున్నాయి. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పాలిస్తారని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.. మరో అడుగు ముందుకు వేసి జైలు నుంచి కేజ్రీవాల్ జారీ చేసిన ఆర్డర్ కాపీ అంటూ ఓ డాక్యుమెంట్‌ను ప్రజల ముందుంచారు. ఈ ఆర్డర్ కాపీని కేజ్రీవాల్ తనకు పంపారని ఆదివారం రోజు మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి చేసిన ప్రకటన వివాదాన్ని రాచేసింది. ఈ వ్యాఖ్యలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిశితంగా పరిశీలిస్తోంది. తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ మంత్రి అతిషికి ఆర్డర్ కాపీని ఎలా పంపారు ? కంప్యూటర్, పెన్ను, పేపర్ లాంటివి తాము ఇవ్వకుండానే కేజ్రీవాల్ నుంచి ఆర్డర్ కాపీ ఎలా జారీ అయింది? అతిషి అబద్ధం చెబుతున్నారా ? అనే కోణంలో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు రెడీ అవుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఈడీ.. కేజ్రీవాల్ జారీ చేశారని ప్రచారం చేస్తున్న ఆర్డర్ కాపీపై అతిషిని ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఆ ఆర్డర్ కాపీ ఎక్కడి నుంచి వచ్చింది ? ఎలా వచ్చింది ? అనే వివరాలను ఆరా తీయనుంది. దీంతోపాటు తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ కదలికలను సమీక్షించేందుకు సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించనుంది.

కస్టడీలో కేజ్రీవాల్‌ను కలిసింది ఆమేనా ?

లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం రాత్రి అరెస్ట్‌ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 28 వరకు ఆయన ఈడీ కస్టడీలోనే ఉంటారు. ప్రస్తుతం కేజ్రీవాల్ సెంట్రల్‌ ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్‌లో ఉన్న ఈడీ ఆఫీస్‌లో ఉన్నారు. కస్టడీ గడువు ముగిసే వరకు ప్రతిరోజూ భార్య సునీత కేజ్రీవాల్, వ్యక్తిగత కార్యదర్శి విభవ్‌ కుమార్‌, లాయర్లకు మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు కోర్టు అనుమతి ఉంది. అదీ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలదాకా మాత్రమే. ఈడీ ఆఫీస్‌లోని మీటింగ్‌ హాల్‌లో సీసీటీవీ పర్యవేక్షలోనే కేజ్రీవాల్ ములాఖత్‌‌లు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సునీత, మరికొందరు ప్రభుత్వం సిబ్బంది వచ్చి కేజ్రీవాల్‌ను కలిశారు. భార్య సునీత కొన్ని పేపర్లతో కేజ్రీవాల్‌ దగ్గరకు వెళ్లారని, ఆ మరుసటి ఉదయమే కేజ్రీవాల్‌ పేరిట ఆదేశాలను అతిషి ప్రకటించారని తెలుస్తోంది.

కేజ్రీవాల్‌ ఫోన్ ఏమైంది ?

ఇక అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్‌ కనిపించడంలేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఆదివారం దర్యాప్తు అధికారులు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్‌ వాడారని అధికారులు ప్రశ్నించగా.. తనకు గుర్తులేదని కేజ్రీవాల్ చెప్పారట. దీంతో అందులోనే కీలక ఆధారాలు ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ ఫోన్ నుంచే మరో నిందితుడు సమీర్‌ మహేంద్రుతో కేజ్రీవాల్ మాట్లాడారని ఈడీ ఆరోపిస్తోంది. ఇక ఈ కేసులో ఏడాదిగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాతో కలిపి కేజ్రీవాల్‌ను మంగళవారం ఈడీ విచారిస్తుందని తెలుస్తోంది.

Advertisement

Next Story