నేను ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వట్లేదు..ఆరోజు కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు: స్వాతి మలివాల్

by S Gopi |
నేను ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వట్లేదు..ఆరోజు కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు: స్వాతి మలివాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ.. తనపై ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉనారని ఆరోపణలు చేశారు. గురువారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇదే సమయంలో ఆమె ఆరోపణలపై సందేహం వ్యక్తం చేస్తున్న అంశంపై స్పందిస్తూ.. బాధితురాలిని అవమానించడం అనేది ప్రతి మహిళ ఎదుర్కొనే సవాలే. అన్నిటికీ సమాధానం స్పష్టంగా తెలిసేందుకు తాను పాలిగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 13న కేజ్రీవాల్ నివాసంలోనే తనపై దాడి జరిగిందని, తాను ఎంత అరిచినా సాయం చేసేందుకు ఎవరూ రాలేదన్నారు. బిభవ్ కుమార్ తన చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, కాలు పట్టి ఈడ్చుకెళ్లాడని, తన తలను టేబుల్ కేసి కొట్టాడని తెలిపారు. సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాకపోవడం తనకూ ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరైనా చెప్పారనే బిభవ్ కుమార్ అలా చేశారా? అని స్వాతి మలివాల్‌ను ప్రశ్నించగా, ఇది విచారణకు సంబంధించిన అంశం. నేను ఢిల్లీ పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాను. ఇదే సమయంలో తాను ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వట్లేదని, అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న సమయంలోనే డ్రాయింగ్ రూమ్‌లో తనపై దాడి జరిగిందని ఆమె వివరించారు. ఈ వ్యవహారంపై తన గొంతు వినిపించడం వల్ల ఇది ఎంతదూరం వెళ్తుంది, తన భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి తాను ఆలోచించలేదని ఆమె చెప్పారు. సాటి మహిళలకు తాను ఏం చెప్తానో అదే చేయాలనుకున్నాను. నిజం పక్షాన నిలబడాలి, వాస్తవాలపై ఫిర్యాదులు చేయాలి, మహిళలకు అన్యాయం జరిగితే పోరాడాలి. కాబట్టి నేను పోరాడకుండా ఎలా ఉండగలనని స్వాతి మలివాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆప్ బిభవ్ కుమార్‌ను ఎందుకు వెనకేసుకు వస్తుందో తెలియట్లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed