తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్

by Hajipasha |   ( Updated:2024-01-28 13:54:34.0  )
తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్
X

దిశ, నేషనల్ బ్యూరో : తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి(బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు) , విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు, జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా నుంచి ఒకరు, రాష్ట్రంలోని ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి మంత్రులైన ముగ్గురిలో విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్, హిందుస్థానీ అవామ్‌ మోర్చా ఎమ్మెల్యే సంతోష్ కుమార్ సుమన్ కూడా మంత్రులయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. ఈసారి నితీశ్ బీజేపీతో చేయి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.దీంతో కాంగ్రెస్, ఆర్జేడీలు కలిసి 2022 సంవత్సరంలో ఏర్పాటు చేసిన మహా కూటమి సర్కారు కూలిపోయినట్లు అయింది. అంతకుముందు ఆదివారం ఉదయాన్నే నితీశ్ కుమార్ గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. తనకు మద్దతు ప్రకటించిన బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు, జేడీయూ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందించారు. నితీశ్ రిక్వెస్టును పరిగణనలోకి తీసుకున్న గవర్నర్.. సాయంత్రం వేళ ప్రమాణ స్వీకారం చేయడానికి రావాలని జేడీయూ చీఫ్‌ను ఆహ్వానించారు. 2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి.

నితీశ్ 5 జంప్‌లు ఇలా..

* 2013 సంవత్సరం వరకు దాదాపు 17 ఏళ్ల పాటు నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారు. అయితే 2013లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించాక.. ఆయన ఎన్డీఏకు కటీఫ్ చెప్పారు. ఎన్డీఏ కూటమి నుంచి పీఎం అయ్యే ఛాన్స్ వస్తుందని ఆశించి భంగపడటంతో అప్పట్లో అలా నితీశ్ జంప్ అయ్యారు.

* 2015లో నితీశ్‌కు చెందిన జేడీయూ.. కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అప్పట్లో కూడా బిహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లలో 80 లాలూ పార్టీ ఆర్జేడీ గెల్చుకుంది. అయినా సీఎం అయింది నితీశే. ఆ తర్వాత రెండేళ్లకే (2017లో) ఆయన జంప్ అయ్యారు. కూటమిలోని ఆర్జేడీ అవినీతికి పాల్పడుతోందనే ఆరోపణ చేసిన నితీశ్.. సింపుల్‌గా బైబై చెప్పి ఎన్డీఏలోకి వెళ్లిపోయారు.

* 2017లో ఎన్డీఏ గూటిలో చేరిన నితీశ్.. మోడీ హవా ఫలితంగా 2019 బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 75 సీట్లలో గెలుపుతూ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా లాలూ పార్టీ ఆర్జేడీ అవతరించింది. అయినా బీజేపీతో కలిసి నితీశ్ సర్కారును ఏర్పాటుచేసి సీఎం అయ్యారు.

* 2020 నుంచి 2022 వరకు బిహార్‌లో సాఫీగానే నడిచిన ఎన్డీఏ సర్కారు చివరకు నితీశ్ జంపింగ్ కారణంగా కూలిపోయింది. 2022 సంవత్సరంలో నితీశ్ కుమార్ తన వైఖరిని మార్చుకొని ఆర్జేడీ పంచన చేరారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, జేడీయూ ఎమ్మెల్యేలను తనపై తిరుగుబాటుకు ఉసిగొల్పుతోందని ఆ సందర్భంగా నితీశ్ ఆరోపించారు.

* తాజాగా ఇప్పుడు మరోసారి(ఐదో దఫా) కూడా నితీశ్ ప్లేటు ఫిరాయించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో 2022 సంవత్సరంలో ఏర్పాటుచేసిన మహా ఘట్‌బంధన్ కూటమికి గుడ్ బై చెప్పి.. ఎన్డీఏకు జై కొట్టి అందరినీ ఆయన ఆశ్చర్యపరిచారు.

Advertisement

Next Story

Most Viewed