న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థకు ఊరట: అరెస్టును రద్దు చేసిన సుప్రీంకోర్టు

by samatah |
న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థకు ఊరట: అరెస్టును రద్దు చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) కేసులో న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థకు ఊరట లభించింది. పుర్కాయస్థను అరెస్టు చేసి ఆ తర్వాత రిమాండ్ విధించడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదుపులోకి తీసుకునే ముందు ఢిల్లీ పోలీసులు అరెస్టుకు కారణాలు, రిమాండ్ దరఖాస్తు కాపీని పుర్కాయస్థకు అందించలేదని, తద్వారా సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని తెలిపింది. ఈ మేరకు ప్రబీర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసినందున, ట్రయల్ కోర్టు నిర్ణయించే షరతులతో రిలీజ్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది.

ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పుర్కాయస్థ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా వెల్లడించింది. పుర్కాయస్థ తరఫు లాయర్‌కు సమాచారం ఇవ్వకుండా రిమాండ్ ఎలా విధించారని ప్రశ్నించింది. కాగా, న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్‌లో చైనా అనుకూల ప్రచారం చేయడానికి ఆ దేశం నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 3న పుర్కాయస్థను అరెస్టు చేశారు. అలాగే న్యూస్ క్లిక్ హెచ్ఆర్‌హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా అరెస్టు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఇటీవలే పుర్కాయస్థ, న్యూస్‌క్లిక్‌లపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఢిల్లీ కోర్టు ఈ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 31న ఇది విచారణకు రానుంది.

Advertisement

Next Story