కొత్త చట్టాల సక్సెస్‌కు కొలమానం అదే : సీజేఐ

by Dishanational4 |
కొత్త చట్టాల సక్సెస్‌కు కొలమానం అదే : సీజేఐ
X

దిశ, నేషనల్ బ్యూరో : కొత్త చట్టాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సొంతం చేసుకున్నప్పుడే కొత్త చట్టాలు విజయవంతమైనట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. నేర విచారణ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘నేర విచారణ వ్యవస్థలో భారత్ ప్రగతిశీల పయనం’’ అనే అంశంపై కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ ప్రారంభోపన్యాసం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహించారు. బాధితుల ప్రయోజనాలను కాపాడేందుకు, నేరాలపై పారదర్శక విచారణ జరిపేందుకు నేర విచారణ వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు చేయడం ముఖ్యమని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘కొత్త చట్టాలకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం అనేది దేశం మారుతోంది. పురోగమిస్తోంది అనడానికి సంకేతం. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన చర్యలు అవసరం’’ అని ఆయన చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాల ద్వారా తీసుకొచ్చిన మార్పుల నుంచి యావత్ దేశం ప్రయోజనం పొందేలా తగినన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడంతోపాటు న్యాయ వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.



Next Story

Most Viewed